
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు రెండు రోజులే గడువు ఉండటంతో పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే ఒక స్వతంత్ర అభ్యర్థి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ అభ్యర్థి మిగిలిన వారి కంటే కొంచెం భిన్నంగా ఉంటారు.
అభ్యర్థి పేరు పద్మరాజన్. గజ్వేల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం పద్మరాజన్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఎలక్షన్ కింగ్ గా పేరొందిన పద్మరాజన్ స్వరాష్ట్రం తమిళనాడు. దేశవ్యాప్తంగా 236 ఎన్నికల్లో పోటీ చేశారు. తమిళనాడు, కర్నాటక, యూపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఇది తన 237వ నామినేషన్ అని పద్మరాజన్ చెప్పారు. ప్రజలు కూడా ఆయనను కలుసుకుని ఫోటోలు దిగుతున్నారు.
మెట్టూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. టైర్ రిపేర్ షాప్ నడుపుతున్న పద్మరాజన్ 1988లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెట్టూరు నియోజకవర్గం నుంచి తొలిసారి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాను మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావుపై ఎన్నికల్లో పోటీ చేశానని కూడా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కోటి రూపాయలపైగా ఖర్చు చేశారు పద్మరాజన్. హోమియోపతి వైద్యుడు కూడా అయిన పద్మరాజన్ డిపాజిట్ కోల్పోయిన సరే, ఎన్నికల్లో పోటీ చేయాలనే మక్కువతో ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇందుకోసం ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. డిపాజిట్ సొమ్ము పోగొట్టుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీ చేశారు. ఈ ఎన్నికలన్నింటిలోకీ 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరుకే అత్యధిక ఓట్లు వచ్చాయని పద్మరాజన్ అంటున్నారు. అప్పుడు ఆయనకు 6,273 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కొన్ని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు ఒక్క ఓటు కూడా రాలేదు. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…