CM KCR in Assembly: చట్టసభల్లో ప్రతి అంశం విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందిః సీఎం కేసీఆర్

|

Mar 15, 2022 | 4:52 PM

ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తాయి.. ఈ విమ‌ర్శలు స‌హ‌జ‌మ‌ని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం ప‌రిణితి చెందే క్రమంలో చ‌ట్టస‌భ‌ల్లో జ‌ర‌గ‌వ‌ల‌సిన చ‌ర్చల స‌ర‌ళి మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

CM KCR in Assembly: చట్టసభల్లో ప్రతి అంశం విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందిః సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us on

CM KCR in Assembly: బ‌డ్జెట్ అనేది ఆదాయ, వ్యయాల కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ‌ర్ రావు(CM K.Chandra Shekar Rao) స్పష్టం చేశారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన త‌ర్వాత అద్భుతంగా ఉంద‌ని అధికార స‌భ్యులు ప్రశంసిస్తారు. ప‌స‌లేని, ప‌నికిమాలిన బ‌డ్జెట్ అని విప‌క్షాలు విమ‌ర్శిస్తాయి.. ఈ విమ‌ర్శలు స‌హ‌జ‌మ‌ని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం ప‌రిణితి చెందే క్రమంలో చ‌ట్టస‌భ‌ల్లో జ‌ర‌గ‌వ‌ల‌సిన చ‌ర్చల స‌ర‌ళి మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కొత్త రాజకీయాల్లోకి వచ్చేవారికి, యువ నాయ‌క‌త్వానికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతస్థాయి చ‌ర్చలు జ‌రిగితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

బ‌డ్జెట్ అంటే బ్రహ్మప‌దార్థం కాదని, అంకెలు మాత్రమే మారుతాయన్నారు. పార్లమెంట్‌లో కానీ, వివిధ రాష్ట్రాల బ‌డ్జెట్‌ల్లో కానీ రెండు విష‌యాలు గ‌మ‌నిస్తాం. బ‌డ్జెట్ అనేది నిధుల కూర్పు. ఈ స‌మ‌కూర్చబ‌డ్డ నిధుల‌ను ఎలా ఉప‌యోగించాల‌నేది కూడా ప్రధానం అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కొత్తపుంత‌లు తొక్కుతోంది. మొట్టమొద‌టి దేశ‌ బ‌డ్జెట్ రూ.190 కోట్లు.. దాంట్లో రూ.91 కోట్లు ర‌క్షణ రంగానికే. అయితే, మర్రి చెన్నారెడ్డి బ‌డ్జెట్ ను ప్రవేశ‌పెట్టారు. అప్పుడు ఏపీ బ‌డ్జెట్ రూ.680 కోట్లు. ఇప్పుడేమో ల‌క్షల కోట్లలో మాట్లాడుతున్నామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలా స‌మ‌కూర్చుకున్న నిధులపై అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంద‌ని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఏ ప్రభుత్వానికైనా ప్రణాళిక విభాగం అత్యంత కీలకమని అన్నారు. భట్టి విక్రమార్క లేవనెత్తే చాలా అంశాలు పార్లమెంట్ వేదికగా నిలదీస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటున్న ప్రతిపక్షాలు.. అవి అప్పులు కాదు నిధుల సమీకరణ అని తెలుసుకోవాలన్నారు. నిధులు ఎలా సమకూర్చుకోవాలో చెప్పేదే బడ్జెట్ అని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారు. సెర్ఫ్‌ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్‌ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సర్ఫ్‌ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అని చెప్పి ఉపాధిహామీలో పని పని చేస్తారన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.