భారీ కరెంట్ బిల్లుతో గుండె గుభిల్లుమని, జేబుకు చిల్లు పడడంతో ఆ ఊరి సర్పంచ్ బుర్రలో ఓ ఐడియా తళుక్కున మెరిసింది. తన ఆలోచనకు రెక్కలు తొడిగి గ్రామస్తుల సహకారంతో కష్టాలను అధిగమించి కరెంట్ బిల్ కట్టే కష్టమే లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ ఊరి వాళ్లు కరెంట్ బిల్స్ కట్టట్లేదు. గవర్నమెంటే వాళ్లకు డబ్బులు కడుతోంది. ఓ చిన్న ఆలోచన ఊరంతా వెలుగులు నింపింది. సూర్యుడు అస్తమించని గ్రామంగా మార్చింది. ఏంటయ్యా ఇదంతా అంటే మా ఊరు సోలారు అంటున్నారు గ్రామస్తులు. ఈ మరి ఈ ఊరి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్. ఊరు చిన్నదే అయినా గ్రామస్తుల ఆలోచనలు చాలా పెద్దవి. సర్పంచ్ చొరవతో వంద శాతం సోలార్ విలేజ్ గా మారుతోంది ఈ గ్రామం. మినిమం బిల్లులను మాత్రమే కడుతూ మిగులు విద్యుత్‌ను విద్యుత్ శాఖకు అమ్ముకుని ఆదాయం సంపాదిస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని 80 శాతం పైగా కుటుంబాలు సౌర విద్యుత్ బాటలో నడుస్తున్నాయ్. అంకోల్ క్యాంప్ ఇప్పుడు సోలార్ వెలుగులు విరజిమ్ముతూ తెలంగాణలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సౌర విద్యుత్ కాంతులు ప్రసరిస్తున్నాయి. ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ వాడకమే కాకుండా రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాల వెలుగుల కోసం కూడా సౌర విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో అన్ని కుటుంబాలు సౌర విద్యుత్ బాటలోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కుటుంబాలు 3 కేవీ మిగతా కుటుంబాలు 2 కేవీ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు.
సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకున్నప్పట్నించీ మినిమం కరెంట్ బిల్లులు మాత్రమే వస్తున్నాయని, అధిక బిల్లులతో జేబులకు చిల్లు పడకుండా ఉందంటున్నారు గ్రామస్తులు. అంతకుముందు నెలవారీ బిల్లు రూ.1000కి పైగా వచ్చేదట. ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో బిల్లుల భారం, విద్యుత్ కోతల ఇబ్బంది లేకుండా గ్రామస్తులు హ్యాపీగా ఉన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటి మీద ఉన్న సోలార్ ప్యానెళ్ల ద్వారా 2021 డిసెంబర్ నుంచి 2022 నవంబర్ వరకు మొత్తం 33,037 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇందులో 22 వేల యూనిట్లను గృహ అవసరాలకు వినియోగించుకున్నారు. 11 వేల యూనిట్ల విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్‌కు విక్రయించారు. దీంతో వీరికి అదనంగా 47,842 రూపాయల ఆదాయం సమకూరింది. వీరు నెలకు కనిష్టంగా రూ.400 నుంచి రూ.600 వరకు ఎన్పీడీసీఎల్ నుంచి ఆదాయం పొందుతున్నారు.
గ్రామంలో సౌరవెలుగులు నింపుతూ పలువురికి మార్గదర్శిగా మారాడు అంకోల్ క్యాంప్ సర్పంచ్ రాము. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు స్త్రీనిధి ద్వారా గ్రామస్తులకు రుణాలను ఇప్పించారాయన. సర్పంచ్ రామును మొదటగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించగా, సక్సెస్ సాధించడంతో కామారెడ్డి కలెక్టర్ జితేష్. వి. పాటిల్ మరింత ప్రోత్సాహాన్ని అందించారు. గ్రామంలో వెలుగులు నింపడంలో గ్రామస్తుల కృషి కూడా ఎంతో ఉంది అంటున్నారు సర్పంచ్ రాము.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం టీఎస్ రెడ్కో 40 శాతం రాయితీ కల్పించింది. మూడు కిలోవాట్ల యూనిట్‌కు రూ.1.05 లక్షల చొప్పున, రెండు కిలోవాట్లకు 80 వేల చొప్పున రుణం మంజూరు చేశారు. మొదట 14 మంది స్వశక్తి సంఘాల సభ్యురాళ్ల ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేశారు. తర్వాత దశలవారీగా దీన్ని గ్రామమంతా అమలు చేశారు. భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించాలంటే గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయాలని, దానికి సోలార్ విద్యుత్ ఒక్కటే మార్గం చూపిస్తుందంటున్నారు సర్పంచ్ రాము.
ఇప్పుడు సోలార్ విద్యుత్ వాడుతున్న కుటుంబాలకు తోడు మిగిలిన కుటుంబాలు సైతం సౌర విద్యుత్ కు సై అంటూ కొత్త అప్లికేషన్‌లు పెట్టుకున్నాయి. కొందరు 3 KV, మరికొందరు 2 KV విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక KV సౌరవిద్యుత్ ప్లాంటుకు 60 వేల రూపాయలు ఖర్చవుతుండగా 3 KV ప్లాంట్ కు 1.80 లక్షలు ఖర్చవుతుంది. వీటికి 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. 50శాతం స్త్రీ నిధి ద్వారా బ్యాంక్ లోన్ ఇస్తుంది. మిగిలిన 10శాతాన్ని మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.
కరెంట్ బిల్లులు కట్టే స్థాయి నుంచి ఏకంగా పంపిణీ సంస్థలకే విద్యుత్ అమ్మే స్థాయికి ఎదిగిన అంకోల్ క్యాంప్ మిగిలిన గ్రామాలకు ఓ కొత్త స్ఫూర్తిని ఇస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..