ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ చెందిన ఓ మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి.. అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. మానసిక వికలాంగురాలైన బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కాలనీలో సోదాలు నిర్వహించగా పోశెట్టి అనే యువకుడి ఇంటి తలుపులు వేసి ఉండటం.. ఎంతకు ఇంట్లోని వారు తలుపులు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులు తలుపు పగలగొట్టారు. అక్కడ బాలిక కట్టేసి ఉండటం.. యువకుడు మత్తులో ఉండటంతో వెంటనే పోలీసులు బాలికను బయటకు తీసుకొచ్చారు.
స్పాట్..
యువకుడి ఇంటిపై బాలిక బంధువుల దాడి
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులు యువకుడి ఇంటికి చేరుకున్నారు. బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఆ యువకుడి ఇంటిపై దాడికి దిగారు. ఇంటికి నిప్పుపెట్టారు. ఆగ్రహంతో యువకుడి బంధువుల ఇళ్లపైనా దాడి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, వారు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువకుడిని తమకు అప్పగించాలని కాలనీ వాసులు ఆందోళనకు దిగడంతో పోలీసులు యువకుడిని రెస్క్యూ చేసి బయటకు తరలించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన స్థానికులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాళ్లు పోలీసులపై పడటంతో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై తిరుపతి, మరో ఇద్దరి కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
రాళ్ల దాడిలో పోలీసులకు గాయాలు
పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ చేసి ప్రజలను చెదరగొట్టి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సీఐ, ఎస్ఐలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ రాళ్ల దాడిలో ఇచ్చోడ ఎస్సై వాహనం ధ్వంసం అయింది. బాధిత బాలికను అదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు పోలీసులు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఉట్నూర్ డిఎస్పి నాగేందర్ ప్రత్యేక బలగాలతో రంగంలోకి దిగారు. అప్పటికే ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు యువకుడు పోశెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాలనీలో పికెట్ ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి