Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పేరు ఫిక్స్..? తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్..!

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్డేట్ వచ్చింది. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు పేరును తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కూాడా పేరును ఫిక్స్ చేశారు. పేర్లపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దాం.

Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పేరు ఫిక్స్..? తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్..!
Airport

Updated on: Sep 24, 2026 | 5:43 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లను ఖరారు చేసింది. వరంగల్ సమీపంలోని మామునూరు వద్ద నిర్మిస్తున్న విమానాశ్రయానికి కాకతీయ రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గం ముందుకు ఈ ఫైల్ వెళ్లనుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేర్లను ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమ దేవి పేరు

వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు సూచించాల్సిందిగా ఇటీవల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వానికి పలు వర్గాల నుంచి అనేక ప్రతిపాదనలు రాగా.. రాణి రుద్రమదేవి పేరును ఎక్కువమంది సూచించారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్టుకు ఆ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ చరిత్ర, వీరుల పోరాట స్పూర్తిని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసేందుకు ప్రభుత్వం ఈ పేరును ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇటీవల విమానాశ్రయాల అభివృద్దిపై ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎయిర్‌పోర్టులకు పేర్లపై చర్చించారు. అనంతరం పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పేర్లపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక తెలంగాణ సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలా ఎయిర్‌పోర్టుల డిజైన్ రూపొందిస్తున్నారు. త్వరలోనే డిజైన్ కూడా విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు త్వరలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి తుది డిజైన్ అందించనున్నారు. ఇటీవల ఏపీలో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభమవ్వగా..  ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.

స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు

ఏపీలోని ఎయిర్‌పోర్టులకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లుగానే.. తెలంగాణలోని ఎయిర్‌పోర్టులకు కూడా అదే విధానాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడంతో పాటు తెలంగాణ చరిత్ర కూడా ప్రపంచానికి తెలియజేసినట్లు అవుతుంది. అటు వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేయనుంది. అనంతరం డిసెంబర్‌లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నారని తెలుస్తోంది.  అటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఇటీవల భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us