Telangana: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. 300 మందికి ఉద్యోగాలు..

తెలంగాణను దేశ డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్ రూపొందించనుంది. అడ్వాన్స్‌డ్ UAV, డ్రోన్ల ఉత్పత్తిపై దృష్టి సారించింది. మహేశ్వరంలో రూ.850 కోట్లతో JSW-షీల్డ్ AI UAV ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇది ఏటా 300 డ్రోన్లను ఉత్పత్తి చేసి, 300 ఉద్యోగాలు సృష్టిస్తుంది.

Telangana: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. 300 మందికి ఉద్యోగాలు..
Minister Sridhar Babu

Updated on: Dec 02, 2025 | 6:41 PM

తెలంగాణ రాష్ట్రాన్ని డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దేందుకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చేలా దశలవారీగా ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్‌లో జేఎస్‌డబ్ల్యూ, షీల్డ్ ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రూ.850 కోట్లతో ఈ ఫెసిలిటిని ఏర్పాటు చేయనున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్లను ఉత్పత్తి చేస్తారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దీని ద్వారా కొత్తగా 300 మందికి హై-వాల్యూ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రొడక్షన్, రీపేర్, టెస్టింగ్ లాంటి సదుపాయాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి.

జాతీయ భద్రతకు అత్యవసరం

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, ఏఐ వంటివి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయని అన్నారు. “ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరం” అని మంత్రి స్పష్టం చేశారు. 2030 నాటికి దేశీయ డిఫెన్స్ యూఏవీ, డ్రోన్ మార్కెట్ విలువ 4.4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఎల్బిట్ సిస్టమ్స్, షీబెల్ వంటి అంతర్జాతీయ డిఫెన్స్ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉండటం రైజింగ్ తెలంగాణకు నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అదనంగా రాష్ట్రంలో డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ కారిడార్‌ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..