Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ స్పెషల్ డ్రైవ్.. వణికిపోతున్న లంచగొండి అధికారులు!

తెలంగాణలో ఏసీబీ స్పెషల్‌ ఫోకస్‌ సత్ఫలితాలు ఇస్తోంది. విస్తృతంగా ప్రచారం కల్పించడంతో కంప్లయింట్ ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. ఏసీబీ అధికారులు తెలంగాణలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. వరుస దాడులతో లంచగొండుల గుండెల్లో నిద్రపోతూ వణుకు పుట్టిస్తున్నారు. దాంతో.. అవినీతి అధికారుల గుట్టురట్టు అవుతోంది. ఒక్క జులైలోనే 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ స్పెషల్ డ్రైవ్.. వణికిపోతున్న లంచగొండి అధికారులు!
Telangana Acb Records

Updated on: Aug 02, 2025 | 7:28 AM

తెలంగాణలో ఏసీబీ స్పెషల్‌ ఫోకస్‌ సత్ఫలితాలు ఇస్తోంది. విస్తృతంగా ప్రచారం కల్పించడంతో కంప్లయింట్ ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. ఏసీబీ అధికారులు తెలంగాణలో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. వరుస దాడులతో లంచగొండుల గుండెల్లో నిద్రపోతూ వణుకు పుట్టిస్తున్నారు. దాంతో.. అవినీతి అధికారుల గుట్టురట్టు అవుతోంది. ఒక్క జులైలోనే 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. 13 మందిని ట్రాప్ చేయగా.. ఆదాయానికి మించి ఆస్తులున్న ఒకరిని, క్రిమినల్ మిస్ కండక్ట్ చేసిన మరొకరిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఏసీపీ ట్రాప్‌ కేసుల్లో జులైలోనే 5 కోట్ల 75 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ.11కోట్ల 5లక్షల విలువైన ప్రాపర్టీని గుర్తించారు ఏసీబీ అధికారులు.

ఇక.. అక్రమాలు, అవినీతికి కేరాఫ్‌గా పేరున్న ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఆయా సమయాల్లో లెక్క చూపని కోటీ 49 లక్షలను స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 148 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 145 మంది ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ ఏడు నెలల వ్యవధిలో 30లక్షల 32వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. లెక్కకు మించిన ఆదాయం కేసుల్లో రూ. 39కోట్లకు పైగా విలువైన ఆస్తులు సీజ్‌ చేశామన్నారు.

మరోవైపు.. తెలంగాణ నీటి పారుదల శాఖలో నమోదు అయిన ఏసీబీ కేసులు, ఆస్తుల సీజ్‌ వ్యవహారాలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఇంజనీర్ ఇన్ చీఫ్ మరళీధర్‌రావు, నూనె శ్రీధర్‌తోపాటు మరో ఇంజనీర్‌ హరిరామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ ముగ్గురు అధికారుల దగ్గరే దాదాపు రూ. 1000 కోట్లకు పైగా అవినీతి సొమ్ము ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే.. అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రచారం కల్పించబోతున్నట్లు ఏసీబీ అధికారులు. లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా.. తెలంగాణలో అవినీతి నిర్మూలన కోసం ఏసీబీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, స్టిక్కర్లు అతికిస్తూ ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..