వికారాబాద్, డిసెంబర్ 25: వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి వెళుతున్న కారు చెరువులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. అందులో నలుగురు అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్ తో పాటు పూజిత కారులో ఉన్నారు. వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డి పేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకు వెళ్ళింది.
అందులో రఘుకి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితలను సురక్షితంగా రక్షించాడు. గుణశేఖర్ కార్ తో సహా మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం గుణశేఖర్ కోసం పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. మునిగిన కారును బయటకు తీశారు. కారుకి ఇరువైపులా డ్యామేజ్ లు ఉండడంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢీకొట్టారా అనే అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం శీతాకాలం అవడంతో అనంతగిరి హిల్స్ వద్ద విపరీతమైనటువంటి పొగ మంచు కమ్ముకొని ఉంటుంది. ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోక నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటుందని పోలీసులు ప్రాథమకి నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లేకుండా పోయినటువంటి గుణశేఖర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.
కారులో ప్రయాణిస్తున్నటువంటి వారంతా స్నేహితులు. పూజిత అనే అమ్మాయి ఇటీవల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. వీరంతా సాఫ్‌వేర్ ఉద్యోగాలతో పాటు బిజినెస్‌లు చేస్తుంటారు. తెల్లవారుజామున మాదాపూర్ నుంచి బయలుదేరిన వీరు ప్రమాదానికి గురయ్యారు. అయితే బస్సు వచ్చి తమ కారు ఢీకొట్టడంతో పొగ మంచులో కనిపించక చెరువులోకి దూసుకెళ్లినట్లు గాయాలు పాలైన స్నేహితురాలు పూజిత చెప్తోంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వింటర్ సీజన్లో అనంతగిరి హిల్స్ ను చూసేందుకు విపరీతంగా పబ్లిక్ అక్కడికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.