పాము కనపడితే చాలామంది బెదిరిపోయి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. అంతెందుకు ఫోన్‌లో పాము విజువల్ కనిపించినా హడలెల్తిపోతారు. ఇక నాగుపాము చాలా డేంజర్. ఇది తెలుగు రాష్ట్రాల్లో తరుచుగా కనిపిస్తూ ఉంటుంది. ఆపద అని భావించినప్పుడు పడగవిప్పి బుసలు కొడుతూ దూసుకువచ్చి కాటు వేస్తుంది నాగుపాము. ఇలాంటి నాగుపాములు.. ఏకంగా 32 ఒక్కసారిగా ఇంట్లో ప్రత్యక్షమైతే. ఇల్లంతా కలియ తిరుగుతుంటే ఇంకేమైనా ఉంటుందా..? గుండెల్లో దడ పుట్టేస్తుంది అంతే. భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని ఓ ఇంట్లో కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు కనిపించడంతో.. అందరూ కంగుతిన్నారు. నెహ్రూ బస్తీలోని నివాసముండే ఎలక్ట్రిషీయన్ రాజు ఇంట్లోని గోడ కన్నంలో ఈ పాము పిల్లలు కనిపించాయి.
వాటిని చూసి హడలిపోయిన రాజు కుటుంబసభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ దత్తు టీం.. ఇల్లంతా జల్లెడ పట్టి ఒక పెద్ద నాగుపాముతో పాటు 32 నాగుపాము పిల్లలను చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి నాగు పామును వాటి పిల్లలను ఓ డబ్బాలో బంధించారు. ఆశ్చర్యకరంగా పిల్ల పాములు కూడా.. డబ్బాలో బంధించిన తర్వాత కూడా పగడవిప్పి బుసలు కొడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు.
ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోకి వచ్చి పాములు నక్కే అవకాశం ఉంటుంది.. షూలలో, కార్లు, బైకుల్లో కూడా అవి చేరే ఆస్కారం ఉండొచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంటి ఆవరణలో గడ్డి, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటికి ఉన్న చిన్న చిన్న రంద్రాలను ఎప్పుడూ మూసివేసి ఉంచాలి. అలానే ఎలుకలను కూడా నియంత్రించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాముల బారిన పడకుండా ఉండవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.