ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

|

Feb 09, 2024 | 9:42 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టునోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
CM Revanth Reddy
Follow us on
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ సందీప్‌ మెహతా ధర్మాసనం.. కేసు బదిలీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్‌ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.
ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేసు ట్రయల్‌కి సన్నాహాలు చేస్తున్నారనే సమాచారం తమకు ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే విచారణపై ప్రభావం చూసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉంటే తాము ఎలా చూస్తు ఉంటామని వ్యాఖ్యానించారు జస్టిస్ బీఆర్
ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌. అలాగే సీఎం రేవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. అధికారం చేపట్టిన వందరోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకున్న పోలీసు అధికారుల్ని నగ్నంగా పరేడ్ చేయిస్తానని రేవంతే చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా కోర్టుకి అందించారు పిటిషనర్. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌ రెడ్డికి, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..