ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సమయం ఇచ్చినా.. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్‌కు మరో అవకాశం ఇచ్చింది..

ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇదే చివరి అవకాశం.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్!
Supreme Court On Brs Mlas Party Defections

Updated on: Jan 16, 2026 | 12:33 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సమయం ఇచ్చినా.. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్‌కు మరో అవకాశం ఇచ్చింది.. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇది చివరి అవకాశమని పేర్కొంది. ఇకపై నిర్ణయం తీసుకోకుంటే తీవ్రంగా వ్యవహారించాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా వింటర్ వెకేషన్ తరువాత తొలిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ శుక్రవారం (జనవరి 16) విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఏడుగురిపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జనవరి 15న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యల ఫిరాయింపులపై పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరిపై పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఈ ఇద్దరిని ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. ఇంతకుముందు మరో ఐదుగురిపై వచ్చిన పిటిషన్లను స్పీకర్ కొట్టి పారేశారు.

తాము BRS ఎమ్మెల్యేలుగానే ఉన్నానని.. తన వేతనం నుంచి ప్రతినెలా 5వేల రూపాయలు.. BRS శాసనసభాపక్షం ఖర్చుల కోసం స్వీకరిస్తోందని స్పీకర్‌కి ఎమ్మెల్యేలు తెలిపారు. అంతేకాదు, తానెక్కడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించలేదని స్పీకర్‌కి వివరణ ఇచ్చారు. గతేడాది నవంబర్‌ నెలలో ఈ కేసును విచారించింది సుప్రీంకోర్టు.. స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. అనర్హత పిటిషన్లపై ఈలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించింది సుప్రీం కోర్టు. నవంబర్‌ వాయిదా తర్వాత మళ్లీ ఇప్పుడు సుప్రీంలో విచారణకు వచ్చింది. అయితే ఇప్పటికే, ఏడుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం.. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా ఏడుగురు MLAలకు స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై మండిపడ్డారు కేటీఆర్‌. పార్టీ మారినట్టు కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవనడం శాసనసభను అవమానించడమేన్నారు. స్పీకర్ వ్యవస్థను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందన్నారు‌. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు.. కాంగ్రెస్‌ భయపడుతోందనేది స్పీకర్‌ తీర్పుతో తేలిపోయిందని అన్నారు. ప్రజాతీర్పును అవమానించిన జంప్‌ జిలానీలకు, వారికి కండువాలు కప్పిన వాళ్లకు బుద్ది చెప్పేవరకు BRS పోరాటం కొనసాగుతుందన్నారు కేటీఆర్‌. ఇటు బీజేపీ కూడా స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం సరికాదంటోంది బీజేపీ. కాంగ్రెస్ తెచ్చిన ఫిరాయింపు చట్టాన్ని ఆ పార్టీయే గౌరవించడం లేదని సెటైర్లేస్తున్నారు బీజేపీ నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..