ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహామీలపై సమరశంఖం పూరించింది విద్యార్థిలోకం. ఏపీకి ప్రత్యేక హోదా, విభజనహామీల సాధన కోరుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 4వ తేదీవరకూ చేపట్టిన సమరయాత్ర విశాఖకు చేరుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమరబస్సు యాత్ర సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకహోదా సాధనసమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం నేతలు, విద్యార్థి యువజన సంఘాలనేతలు హాజరయ్యారు.
ఎనిమిదేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు చలసాని శ్రీనివాస్. బడ్జెట్ సహా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష నేతలందరూ కలిసికట్టుగా పోరాడాలని చలసాని పిలుపునిచ్చారు.
యువజన విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 1800 కిలోమీటర్లు కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా, విభజనహామీలు, కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్ ప్రకటన, స్టీల్‌ప్లాంట్ , పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు సమరయాత్ర చేపట్టాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..