Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?
Siddipet News: సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేసి 40 గొర్రెలను చంపేసింది. ఈ ఘటనలో గొర్రెల పెంపకందారుడు శ్రీనివాస్‌కు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి చేసి, నోటికొచ్చిన జీవాలను కొరికి చంపేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 5 లక్షల మేర నష్టం వాటిల్లడంతో బాధితుడు కన్నీరుమున్నీర వుతున్నాడు.
మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే పెంపకందారుడు రోజూలాగే తన గొర్రెల మందను దొడ్డిలో ఉంచాడు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై విరుచుకుపడింది. పిచ్చిగా కొరుకుతూ బీభత్సం సృష్టించింది. కుక్కల దాడి తీవ్రతకు సుమారు 40 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటికైనా పశుసంవర్థక శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించి, నష్టపరిహారం అందించి బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
