శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం… యాదాద్రి!

| Edited By:

Sep 29, 2019 | 7:36 PM

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. క్షేత్ర మహిమ: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని […]

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం... యాదాద్రి!
Follow us on

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.

క్షేత్ర మహిమ:

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏం కావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు.

అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.

మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.

ఎలా వెళ్ళాలి: 

రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.

వసతి సదుపాయాలు

  • శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం. టోల్ గేట్ దగ్గర ఉంటుంది ఈ సత్రం
  • శ్రీ అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం సంఘం ఉంది. పాత గుట్ట రోడ్ లో ఉంది.

సందర్శన వేళలు:

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు తిరువారాధన, 5గంటలకు బాలభోగం, 5.30గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం, ఉదయం 6.15గంటలకు తులసీఅర్చన, 7గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8.30గంటలకు నిత్యకల్యాణం, మధ్యాహ్నం 12గంటలకు నివేదన, సాయంత్రం 5గంటలకు నిత్యాలంకర తిరువీధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7.30గంటలకు తులసీకుంకుమార్చనలు, ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపైన గల శ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5గంటలకు నుంచి రాత్రి 8గంటలకు వరకు పూజలు కొనసాగుతాయి.