Telangana: ఎల్లయ్యా..! నీ కొడుకు మనసులో నీవు ఎప్పటికీ చిరంజీవేనయ్యా..!

నాన్న లేని లోటును మాటల్లో కాదు… నాటులో చూపించాడు ఓ కొడుకు. మహబూబాబాద్ జిల్లాలో తన తండ్రి పేరు ప్రతిబింబించేలా వరి నారుతో అక్షరాలు చెక్కిన యువ రైతు కథ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల ...

Telangana: ఎల్లయ్యా..! నీ కొడుకు మనసులో నీవు ఎప్పటికీ చిరంజీవేనయ్యా..!
Farmer Son Tribute

Edited By:

Updated on: Dec 20, 2025 | 3:38 PM

నాన్న అంటే ఎంత వయసు వచ్చినప్పటికీ పిల్లలకు ఓ ఎమోషన్. ఎన్ని గాయలకు ఓర్చి.. కష్టనష్టాలను భరించి.. పిల్లల్ని ప్రేమతో పెంచి పెద్ద చేసిన నాన్న అంటే.. సంతానానికి అమితమైన ప్రేమ, గౌరవం ఉంటాయి. అలాంటి తండ్రిని కోల్పోవడం ఏ కొడుకుకైనా తట్టుకోలేని బాధ. తీరని లోటు. ఆయన లేని బాధను, ఆయన పంచిన ప్రేమను ఓ వ్యక్తి లోకానికి చూపిన తీరు భావోద్వేగానికి గురిచేస్తోంది.. తన తండ్రి చనిపోయాడు.. ఆ తండ్రికి జీవనాధారాయమైన వ్యవసాయ క్షేత్రంలో తండ్రి పేరు ప్రతిబింబించేలా చేసిన వరి సాగు ఇప్పుడు వాహ్ అనిపిస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకుని చిన్నప్పటి నుంచి తన తండ్రి పొలం పనులు చేస్తుండటం గమనిస్తూ వస్తున్న కొడుకు ఆ పొలంలోనే తన తండ్రి పేరును నారుగా పోశాడు.. తండ్రి పేరు ప్రతిబింబించేలా ఏపుగా పెరిగిన వరి నారు చూసి కొడుకు మురిసిపోతున్న ఘటన స్థానికంగా అందరికీ ఆనందం కలిగిస్తోంది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామానికి చెందిన అల్లాడి రాజు తండ్రి అల్లాడి ఎల్లయ్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.. తనకు మెరుగైన జీవనం ఇవ్వడం కోసం ఎంతో కష్టపడ్డ ఆ తండ్రిపై కొడుక్కు ఎనలేని ప్రేమ.  ఉదయం లేవగానే పొలాలకు వెళ్లి పంటను కంటికి రెప్పలా చూసుకునే ఎల్లయ్య గ్రామంలో మంచి రైతుగా పేరొందారు.. తండ్రి మృతి తరువాత పొలం పనులను చేపట్టిన రాజు తన నారు పనులను ప్రారంభించే ముందు పంట పొలంలోనే నారుతో తన తండ్రి పేరును చెక్కి అందరికి విభిన్నంగా కనిపించేలా చేశాడు. పచ్చగా వికసిస్తున్న నారులో ‘ఎల్లయ్య ‘ అనే అక్షరాలతో నారు పెంచాడు.

ఈ యువ రైత తన తండ్రిపై చూపిన ఆప్యాయత, అభిమానం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. “నాన్నకి ప్రేమతో… ఆయన పేరు ఈ నేలపై ఎప్పటికీ పచ్చగా ఉండాలి” అని రాజు భావోద్వేగానికి లోనయ్యాడు.

గ్రామస్తులు రాజు చేసిన పనికి అభినందిస్తూ తండ్రి పట్ల ప్రేమను ప్రశంసిస్తున్నారు.. వృద్దాప్యంలో కన్నవారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లలో అనాథలుగా వదిలేస్తున్న ఈ రోజుల్లో తండ్రిని స్మరించుకుంటూ ఈ యువ రైతు చేసిన పనిని ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు.

Also Read: శృతి తప్పిన శృతిలయ.. ఈ లేడీ బీట్ ఆఫీసర్ పెద్ద మ్యాటరే నడిపింది..