
ఇల్లిల్లూ తిరుగుతూ భవతి బిక్షం దేహి అని జోలె పట్టుకుని ఆడుకుంటున్న వ్యక్తిని చూసి.. ఎవరో సాధువు లేదా భిక్షగాడు అనుకుంటే పొరపాటే. తండ్రి కోసం మొక్కుకున్న ఒక యువకుడు.. అది నెరవేరడంతో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి.. తన మొక్కును తీర్చుకున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో మానేగాళ్ల రాంకిష్టయ్య సర్పంచ్ పదవి కోసం బరిలో దిగాడు. అయితే ఊహించని విధంగా అతని కుమారుడు వెంకటేష్ సైతం సర్పంచ్ పదవి కోసం పోటీకి నిలిచాడు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఫైనల్‌గా ఎన్నికల్లో కొడుకు వెంకటేష్‌పై తండ్రి 99 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
అయితే రెండవ కుమారుడు తండ్రిని ఓడించేందుకు పోరాటం చేస్తే.. మూడవ కుమారుడైన భాస్కర్ తన తండ్రి గెలుపు కోసం ఆరాటపడ్డాడు. జన్మనిచ్చిన నాన్న గెలుపు కోసం శ్రమించడమే కాకుండా దేవుళ్లకు మొక్కులు మొక్కుకున్నాడు. తన తండ్రి గెలిస్తే.. ఊర్లోని ఇంటింటికి తిరిగి బిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఎన్నికల్లో తండ్రి విజయం సాధించడంతో.. ప్రతి ఇంటికి వెళ్లి భిక్షాటన చేశారు. భవతి భిక్షాందేహి అంటూ బియ్యం సేకరించారు. వచ్చిన బియ్యంతో కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..