Covid-19 Fear: తెలంగాణలో కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వచ్చి కొందరు చనిపోతుంటే.. కరోనా రిపోర్టులు రాకముందు ఎక్కడ పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో మరి కొందరు మరణిస్తున్నారు. ఇక తాజాగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న కరోనా టెస్టులకు వచ్చి రిపోర్టులు రాకముందు చెట్టు కింద సేద తీరుతుండగా, తల్లి ఒడిలోనే అశోక్ కన్నుమూసిన ఘటన అందరిని కలిచివేస్తోంది. అయితే ఈ ఘటన ద్వారా చాలా నేర్చుకోవాలని అంటున్నారు నిజామాబాద్ జనరల్ పిజిషియన్ డాక్టర్ తిరుపతి రావు. ఆయన సోమవారం టీవీ9తో మాట్లాడుతూ..
ర్యాపిడ్ టెస్ట్లో, ఆర్టీపీసీఆర్‌లో వచ్చిన రిపోర్టులో కరోనా లేదని నిర్ధారణ అయినట్లు కాదని.. అశోక్ శ్వాస సంబంధిత సమస్యతో చనిపోయినట్లు తెలుస్తోంది. జ్వరం ఉండి కూడా నెగెటివ్ వచ్చిందంటే వైరస్ శరీరంలో లేదని కాదని ఆయన అంటున్నారు. కొంత మంది ఆక్సిజన్ లెవల్స్ 60 శాతం ఉన్నా మనిషి యాక్టివ్ కనిపిస్తారు.. దీనిని హ్యాపీ హైపాక్సామి అంటారు. అంటే మనిషి అప్పటి వరకు భాగానే ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని బయట చాలా మంది తిరగడం కూడా వైరస్ వ్యాప్తికి కారణంగా మారుతుంది అని టీవీ9తో తెలిపారు. లక్షణాలున్నా 8 రోజుల్లో సిటీ స్కాన్ తీయించుకోవాలి. కోవిడ్ ఏ స్టేజిలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. లక్షణాలు ఉన్నా.. ఎవరు కూడా బయట తిరగవద్దు. ఇతరులకు అంటించవద్దు అని పేర్కొన్నారు. కొన్ని సార్లు భయం కూడా మనిషి చావుకు కారణం కావచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కంగారు పడటం కూడా దీనికి కారణమవుతుంది.
కాగా, సోమవారం రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి కరోనా పరీక్షలకు అని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆయనతో పాటు తల్లి, ఆయన భార్య, తమ్ముడు కూడా వచ్చారు. అయితే పీహెచ్‌కి వచ్చిన ఆయన పరీక్షలు చేయించుకుని చెట్టు కింద సేద తీరాడు. ఇక కరోనా రిపోర్టు రాకముందే టెన్షన్‌కు గురైన అశోక్.. తల్లి ఒడిలోనే మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన అందరిని కలచి వేసింది.