Gandikota: గండికోటలో నిద్రపోతున్న నిఘా నేత్రాలు.. గుడారాల ముసుగులో చాటుమాటు యవ్వారం

|

Sep 03, 2024 | 4:34 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో గండికోట ఒకటి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం దేశ వ్యాప్తంగా పర్యాటకులను అలరిస్తూ ఉంటుంది. కనుచూపు మేర ఎత్తైన కొండలు, పెన్నానది జల సోయగాలు ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తాయి. అయితే ఇక్కడ కంటికి కన్పించని అసాంఘిక కార్యకలాపాలెన్నో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. చీకటి పడితే వందల సంఖ్యలో వెలిసే గుడారాలు చీకటి నేరాలకు..

Gandikota: గండికోటలో నిద్రపోతున్న నిఘా నేత్రాలు.. గుడారాల ముసుగులో చాటుమాటు యవ్వారం
Private Tents In Gandikota
Follow us on

గండికోట, సెప్టెంబర్‌ 3: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో గండికోట ఒకటి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం దేశ వ్యాప్తంగా పర్యాటకులను అలరిస్తూ ఉంటుంది. కనుచూపు మేర ఎత్తైన కొండలు, పెన్నానది జల సోయగాలు ప్రకృతి ప్రియులను కట్టిపడేస్తాయి. అయితే ఇక్కడ కంటికి కన్పించని అసాంఘిక కార్యకలాపాలెన్నో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. చీకటి పడితే వందల సంఖ్యలో వెలిసే గుడారాలు చీకటి నేరాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. మద్యం, మత్తు మందులను యదేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎలాంటి నిఘా లేకపోవడంతో గండికోట నిలయంగా అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారు.

గండికోటకు రాష్ట్రంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారమైతే వీరి సంఖ్య రెట్టింపవుతోంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం కారణంగా అనేక మంది రాత్రి సమయంలో కూడా ఇక్కడే గడిపేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కొందరు అక్కడే ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు వేసుకుంటే, మరికొందరు అద్దెగదుల్లో సేద తీరుతున్నారు. పర్యాటకుల ముసుగులో కొందరు పగలు, రాత్రి తేడా లేకుండా మత్తులో మునిగి తేలుతూ జూదం ఆడుతున్నారు. దీంతో ప్రతివారం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని సమాచారం. విలాసాలకు గండికోటకు విచ్చేస్తున్న యువత మద్యం, మాదకద్రవ్యాల మత్తులో మైమరిచి పోతున్నారు. దీంతో విద్యార్థులు, యువత చెడు వ్యసనాలబారిన పడుతున్నారు.

ప్రైవేటు హోటళ్లు, గుడారాల యజమానులకు సీఐ లింగప్ప వార్నింగ్

శని, ఆదివారాల్లో గండికోట ఊరిబయట ఖాళీ ప్రదేశంలో అనధికారికంగా వందల సంఖ్యలో గుడారాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజూ 100 గుడారాలు ఏర్పాటు చేస్తే.. శని, ఆదివారాల్లో 300 వరకు వేస్తున్నారు. వీటికి రోజుకు రూ.1,500 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉంటూ రచ్చచేస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఇబ్బందిపడాల్సి వస్తుంది. గతంలో కూడా ఇక్కడ అనేక అల్లర్లు, ఘర్షణలు, చోరీలు సైతం జరిగాయి. ఇంత జరుగుతున్నా.. అక్కడ కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడం విశేషం. పోలీసులు ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై స్పందించిన జమ్మలమడుగు అర్బన్‌ సీఐ లింగప్ప.. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు హోటళ్లు, గుడారాల యజమానులు భద్రత చర్యలు పాటించాలని సూచించారు. అశాంఘిక శక్తులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.