టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఏ-2 ముద్దాయిగా ఉన్న అట్ల రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు సిట్ అధికారులు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయ్. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వందమంది క్వాలిఫై అయ్యారంటూ రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో కొంత వాస్తవం ఉన్నట్టు గ్రహించింది సిట్. కేటీఆర్ పీఏ తిరుపతితోపాటు ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ది కూడా మల్యాల మండలమే కావడంతో ఫుల్ ఫోకస్ పెట్టారు సిట్ అధికారులు.
కాగా ఇదే కేసులో టీఎస్‌పీస్‌సీ ఛైర్మెన్ స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేసింది సిట్ బృందం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో.. నిందితులను రెండు దఫాలుగా కస్టడీకి తీసుకున్న సిట్.. అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్, రమేష్ లతో పాటు మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ లకు ఐదు రోజుల పాటు విచారించి పలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..