సింగరేణిలో ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే కార్మిక సంఘాలు ప్రచారంలోకి దిగిపోయాయి. అయితే ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపించగలవని పలువురు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా జాప్యానికి గురవుతూ వస్తున్న కు ఎట్టకేలకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్ 28వ తేదీన సింగరేణి ఎన్నికలను నిర్వహించాలని హైదరాబాద్‌లోని కేంద్ర కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యాజమాన్యం, కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజున ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. దీంతో.. సింగరేణి లో ఎన్నికల హడావిడి మొదలైయింది. 1998వ సంవత్సరంలో సింగరేణి సంస్థలో తొలిసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.
రెండు సంవత్సరాల కాల పరిమితితో రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల అనంతరం, గెలిచిన సంఘాల కాల పరిమితిని నాలుగేళ్లకు పెంచి ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా, చివరి ఎన్నికలు 2017 వ సంవత్సరంలో జరిగాయి. గత ఎన్నికల్లో గెలుపొందిన TBGKS యూనియన్‌కు యాజమాన్యం ఆలస్యంగా గుర్తింపు పత్రం ఇవ్వడంతో 2022 వరకు ఆ యూనియన్ గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తూ వచ్చింది. కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర కాలం కావస్తున్నా కూడా.. యాజమాన్యం ఉత్పత్తి పై ప్రభావం పడుతుందన్న సాకుతో ఎన్నికల నిర్వహణను జాప్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో AITUC న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. కోర్టు సూచన మేరకు కేంద్ర కార్మిక శాఖ ఈనెల 11వ తేదీన యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
చర్చల అనంతరం సింగరేణి ఎన్నికలను అక్టోబర్ 28వ తేదీన నిర్వహించాలని ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే, కుదిరిన నిర్ణయం మేరకు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయకుండా, ఈనెల 22వ తేదీన మరోమారు సమావేశం నిర్వహించి, ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని యాజమాన్యం మెలికపెట్టడం గమనార్హం. ఏది ఏమైనప్పటికి, సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగితే.. కోల్ బెల్ట్ ప్రాంతంలో రాజకీయ సందడి ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సింగరేణి ఎన్నికలు ప్రధాన పార్టీలకు రెఫరెండంగా మారనున్నాయి. ఉత్తర తెలంగాణలోని కోల్ బెల్ట్ వ్యాప్తంగా గల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయనున్న సింగరేణి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి తమ యూనియన్ గెలుపు కోసం ముమ్మర ప్రచారాలు నిర్వహించనున్నారు. గుర్తుల కేటాయింపు అనంతరం 18 రోజుల పాటు ప్రచారానికి సమయం ఉండడంతో కోల్ బెల్ట్ ప్రాంతమంతా మినీ రాజకీయ రంగానికి వేదికగా మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..