Telangana: తెలంగాణలో మరో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలు..

| Edited By: Srikar T

Dec 22, 2023 | 3:24 PM

సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అగ్ర నేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్ (TBGKS) చతికిల పడడంతో ఏఐటియూసీ (AITUC) ఐఎన్‎టియూసీ (INTUC) యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana: తెలంగాణలో మరో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలు..
Singareni Elections
Follow us on

సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అగ్ర నేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్ (TBGKS) చతికిల పడడంతో ఏఐటియూసీ (AITUC) ఐఎన్‎టియూసీ (INTUC) యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 40వేల మంది గని కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో రాజకీయ వేడి రాజుకుంది. గుర్తింపు సంఘం హోదాను దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు ఉదృత ప్రచారంతో కదం తొక్కుతున్నాయి. కాంగ్రెస్, సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలతో పాటు మిగితా కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి .

భౌగోళిక పరంగా చూస్తే ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో 350 కిలోమీటర్ల పొడవునా 11 ఏరియాల్లో.. 23అండర్ గ్రౌండ్ మైన్స్, 19ఓపెన్‌ కాస్టు గనులతో సింగరేణి సంస్థ పరిడవిల్లుతోంది. అనునిత్యం బొగ్గును వెలికి తీస్తూ దేశానికి వెలుగులు పంచుతోంది. శతాధిక సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యూలర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42 వేల మంది, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం అధికారులు కాకుండా దాదాపు 40 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి ఇలా మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు సాగుతున్నాయి..

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం 11 అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ గెలుపొందింది. ఈఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్టవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. కోల్ బెల్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందుకోసం సింగరేణిలో అనుబంధ యూనియన్లను గెలిపించుకునేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారు . ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు వాయిదా పడుతుండడంతో కార్మికసంఘాలు ఎన్నికల కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగించాయి. ఎట్టకేలకు కోర్ట్ ఆదేశాలతో బొగ్గు గనుల పై ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.

ఇవి కూడా చదవండి

సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. వీటిలో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఓసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం జారీ చేసిన ఆదేశాలతో మనస్థాపానికి గురైన బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్ (TBGKS) అగ్రనేతలు ముగ్గురు యూనియన్‎కు రాజీనామా చేయడంతో ఆ యూనియన్ చతికిల పడినట్లు అయింది. దీంతో, ప్రధాన పోటీ జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల మధ్యనే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఐటీయూ ,బిఎంఎస్ ,హెచ్.ఎం.ఎస్ జాతీయ సంఘాలు ప్రాతినిధ్యం కోసం పావులు కదుపుతున్నాయి.

సింగరేణి కార్మికుల సంక్షేమం, మెరుగైన ప్రయోజనాలు తమ హయాంలోనే కల్పించబడ్డాయని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం, గుర్తింపు సంఘం వారే ఉన్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు. కారుణ్య నియమాకాల వ్యవహారంలో మెడికల్ బోర్డు రూపకంగా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున తమ యూనియన్‎ను గెలిపిస్తేనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని ఐఎన్టీయూసీ నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్ సర్కారు సంఘాన్ని ఎన్నుకుంటే కార్మికులకు మళ్లీ తిప్పలు తప్పవని ఏఐటీయూసీ నాయకులు కౌంటర్ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మిత్ర పక్షాలుగా కోల్ బెల్ట్‌లో పది ఎమ్మెల్యే సీట్లను సాధించిన కాంగ్రెస్, ఒక ఎమ్మెల్యే సీటును సాధించిన సీపీఐలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా తలపడుతుండడం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలివే కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తింపు హోదా సాధించడం ప్రేస్టిజ్ ఇష్యూగా మారింది. ఆసక్తికర పరిణామాల మధ్య ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల్లో అంతిమ విజేత ఎవరనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..