Siddipet Additional SP as Common Man: కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తే తాటతీస్తాం.. అనవసరంగా బయటికొస్తే బండి సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అంతకుమించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ప్రత్యక్షంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా చైన్ బ్రేక్ చేస్తేనే సమాజం భద్రంగా ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలని సజెస్ట్ చేస్తున్నారు. ఓ వైపు భద్రత అంటూ సున్నితంగా మెసేజ్ ఇస్తూనే.. గీత దాటే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
లాక్‌డౌన్ కఠినంగా అమలవుతుందా.. లేదంటే మొక్కుబడిగా తూతు మంత్రం చర్యలతో సరిపెడుతున్నారా? ఇదే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఆదే క్రమంలో సిద్ధిపేట ఆడిషనల్ ఎస్పీ ఏకంగా మారు వేషంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించి పోలీస్ సిబ్బందిని షాక్‌కి గురిచేశారు. తలకు రుమాలు ధరించి, పాత మోటారు బైక్‌పై ఎక్కి ఒక్కో చెక్‌పోస్ట్ దగ్గర ఒక్కో రకంగా పోలీసులకు సమాధానాలిచ్చి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఒక చోట మెడిసిన్స్ కావాలని.. మరో చోట మంత్రి పీఏ రెకమెండేషన్ అని.. ఇంకోచోట పాలు పోసేందుకు వెళ్తున్నానని సమాధానమిచ్చారు. కానీ పోలీసులు అవేవీ పట్టించుకోలేదు. ముందుకు వెళ్లనీయకుండా ఆపేశారు. పోలీసులు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఏఎస్పీ. తిరుగు పయనంలో తలకు ఉన్న రుమాలు లేకుండా వచ్చిన ఆ అదనపు ఎస్పీని చూసి..ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.
పల్లె నుంచి పట్టణం దాకా లాక్‌డౌన్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ పాస్‌లు తప్పనిసరి చేశారు. కేవలం కోవిడ్ పేషెంట్లకు, మందుల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలకి షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇస్తున్నామన్నారు పోలీసులు. వేల వాహనాలు సీజ్ చేసి.. కోట్ల రూపాయల ఫైన్లు విధిస్తున్నామన్నారు. అనవసరంగా బయటికి వచ్చి ప్రజలు ఇబ్బంది పడొద్దని సూచిస్తున్నారు.