Medak District: మెదక్ జిల్లాలో వింత పరిస్థితి.. పీడిస్తున్న అధికారుల కొరత.. కుంటుపడుతున్న అభివృద్ధి, సంక్షేమం..
Medak District: మెదక్ జిల్లాను అధికారుల కొరత పీడిస్తోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా జిల్లాలో పలు కీలక శాఖలకు ..

Medak District: మెదక్ జిల్లాను అధికారుల కొరత పీడిస్తోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా జిల్లాలో పలు కీలక శాఖలకు విభాగాధిపతులు కరువయ్యారు. కేవలం ఇన్‌చార్జిలే దిక్కు అయ్యారు. దాంతో జిల్లాలో పాలన గాడి తప్పుతుంది. అదనపు బాధ్యతలతో అధికారుల పర్యవేక్షణ కొరవడగా.. అది అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
అంతా ఇంచార్జిలే..
తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక కొత్తగా మెదక్ జిల్లాను ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలోనే హెడ్ క్వాటర్ ఏర్పాటు చేసి జిల్లా అధికారులను నియమించారు. ఇక్కడే కలెక్టరేట్ ఏర్పాటు కావడంతో ప్రజలు సంతోషించారు. కానీ ఆ సంతోషం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలినట్లయింది. మొదట కొద్ది రోజులు పాలన మొత్తం కూడా సవ్యంగానే నడిచింది. అయితే ఈ మధ్యే మెదక్ కలెక్టరేట్‌లో అధికారుల కొరత మొదలైంది. 60శాతం మంది అధికారులు ఇంచార్జిలే ఉన్నారు. చిన్న చిన్న పోస్టలకు ఇంచార్జిలు ఉన్నారంటే సర్లే అనుకోవచ్చు.. కానీ, ఏకంగా జిల్లా అధికారి అయిన కలెక్టర్ కూడా ఇంచార్జి కావడంతో ఏ పనులూ సరిగ్గా జరగడం లేదు. గతంలో పనిచేసిన కలెక్టర్ ధర్మారెడ్డి పోయిన సంవత్సరం జులై 31న రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో ఇంచార్జి కలెక్టర్‌గా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేష్ కొద్ది రోజులు విధులు నిర్వహించారు. అయితే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్‌లో నగేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి మెదక్ కలెక్టరేట్‌లో మొత్తం ఇంచార్జిలమయం అయిపోయింది.
నేడు కలెక్టరేట్ ఉన్నా..
గతంలో కూడా పేరుకే మెదక్ జిల్లా అని పేరు ఉండేది. హెడ్‌క్వార్టర్స్ మొత్తం సంగారెడ్డిలోనే ఉండేది. దీంతో ఈప్రాంతం అభివృద్ధికి నోచుకోక చాలా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజలకు జిల్లా కార్యాలయం దగ్గర్లో లేక, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేవారు. ఇప్పడు మాత్రం జిల్లా కార్యాలయం ఏర్పాటు అయినా.. అధికారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు సకాలంలో అందక.. మరోవైపు అభివృద్ధి లేక జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మొత్తం ఇంచార్జిలే ఉండటంతో ఏ పని కూడా సక్రమంగా జరగడం లేదు.
సిద్ధిపేట కలెక్టరే మెదక్ కలెక్టర్‌గా..
ఇదిలాఉండగా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి మెదక్ కలెక్టర్ ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సిద్ధిపేటలోనే ఫుల్ బిజీగా ఉండడంతో మెదక్ జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మెదక్ కలెక్టరేట్‌లో అధికారుల కొరతపై దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారించాలని ప్రజలు కోరుతున్నారు.
