Telangana: సీఎం రేవంత్ నోట సంచలన మాట.. షాక్‎లో సీనియర్ నేతలు..

|

Jun 27, 2024 | 9:25 PM

ఆ ఒక్క మాటతో 'చేతులు జేబులో పెట్టుకుని' వెళ్లిపోయారంతా. ఎంతో ఆశించి, ఎదురుచూసి, ఇక కబురు రావడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. బాంబ్‌ పేల్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. మంత్రివర్గంలో ఏ ఒక్క శాఖ ఖాళీలేదు అనేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లింది విస్తరణపై చర్చలకు కాదా? సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం ఏంటి

Telangana: సీఎం రేవంత్ నోట సంచలన మాట.. షాక్‎లో సీనియర్ నేతలు..
Revanth Reddy
Follow us on

ఆ ఒక్క మాటతో ‘చేతులు జేబులో పెట్టుకుని’ వెళ్లిపోయారంతా. ఎంతో ఆశించి, ఎదురుచూసి, ఇక కబురు రావడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో.. బాంబ్‌ పేల్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. మంత్రివర్గంలో ఏ ఒక్క శాఖ ఖాళీలేదు అనేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లింది విస్తరణపై చర్చలకు కాదా? సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం ఏంటి..

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కుతున్నారనే వార్త వినగానే.. ‘ఎన్నాళ్లకు పెదపండగ వచ్చే’ అనే పాట అందుకున్నారు చాలామంది. హస్తినలో గుసగుసలు గాంధీభవన్‌లో వినిపిస్తాయన్న ఆశతో నిత్యం వస్తూ వెళ్తూ ఉన్నారు ఆశావహులు. పైగా ఒకట్రెండు రోజుల టూర్‌ కూడా కాదది. వరుసపెట్టి నాలుగు రోజులు. ఇంకేముంది.. అంతా మంత్రివర్గ విస్తరణ గురించే అనుకున్నారంతా. ‘బహుశా మంత్రివర్గంలో తన శాఖ అదే అయి ఉంటుంది’ అని ఎవరికి వాళ్లు ఊహాల్లో తేలిపోయారు. అందులో భాగంగానే మీడియాకు కొన్ని లీకులు కూడా అందాయి. అందుకే, మీడియా కూడా ఫలానా వారికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్‌ ఉండొచ్చనే చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్‌ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి పెద్ద బాంబ్ పేల్చారు. ‘ఎవరు చెప్పారు మీకసలు’ అంటూ మీడియాతో అసలు విషయం పంచుకున్నారు.

అదీ మ్యాటర్..! ఏ ఒక్క శాఖ కూడా ఖాళీలేదిక్కడ..! ఈ ఒక్క మాట విన్నాక అమాత్యా అనిపించుకోవాలని ఎదురుచూసిన వాళ్లంతా ‘జేబులో చేతులు పెట్టుకుని’ సైలెంట్‌గా వెళ్లిపోయి ఉంటారు. మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని తేల్చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ విషయంపై అధిష్టానంతో ఒక్కముక్క కూడా మాట్లాడలేదని చెప్పేసరికి ఆశావహుల్లో నిట్టూర్పులు కనిపించాయి. అసలు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిందే మంత్రివర్గ విస్తరణ గురించని అనుకున్నాం కదా.. ఇప్పుడిలా అన్నారేంటని మాట్లాడుకుంటున్నారు కొందరు. ఎందుకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఢిల్లీ వెళ్లగా.. ఆ తరువాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్లారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై గట్టిగానే కసరత్తు జరుగుతోందని అనుకున్నారు. కానీ.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.

జాగ్రత్తగా గమనిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేయబోము అని చెప్పడం లేదు. శాఖలు ఖాళీలేవు అని మాత్రమే అన్నారు. బహుశా కొన్ని మీడియాల్లో వచ్చిన తప్పుడు వార్తలకు సీఎం రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చినట్టు కనిపిస్తోంది. అడిగిన వాళ్లు కూడా శాఖలు ఖాళీగా ఉన్నాయట కదా అనే అడిగారు. దానికి సమాధానంగా ‘ఏ శాఖ ఖాళీలేదు’ అని కాస్త సీరియస్‌ సమాధానమే చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. నిజంగానే ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, జీఏడీ, లా అండ్‌ ఆర్డర్‌ శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఆ కోణంలో శాఖలు ఖాళీ లేవు అని చెప్పినట్టున్నారు. పైగా మంత్రివర్గ విస్తరణకు ఇప్పట్లో వచ్చిన తొందరేం లేదనే సంకేతాలు కూడా పంపించారు.

మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.. కానీ ఇప్పుడు కాదు. ఇవే సంకేతాలు పంపించారు సీఎం రేవంత్‌ రెడ్డి. బహుశా ఇంకొన్ని చేరికలు ఉన్న కారణంగానే క్యాబినెట్‌ ఎక్స్‌పాన్షన్‌ను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్‌ నుంచి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పటికిప్పుడు మరో 10 మందికి పైగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ నుంచి వచ్చే ఒకరిద్దరు పెద్ద నేతల కోసం మంత్రి పదవులను ఖాళీగా పెట్టారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు గ్రేటర్‌లో బలం లేకుండా పోయింది. అందుకే, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది కూడా. వచ్చే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు అవసరం అని పార్టీ భావిస్తోంది. అందులోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను రిప్రజెంట్‌ చేస్తూ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. బహుశా, బీఆర్ఎస్ గ్రేటర్‌ ఎమ్మెల్యేల కోసమే విస్తరణను ఆపుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

వచ్చే జనవరికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కాకపోయినా సరే.. బలమైన నేతలను చేర్చుకుని వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చనే ఆలోచన కూడా చేస్తున్నట్టున్నారు. మంత్రి పదవి స్వీకరించిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉంటే సరిపోతుంది. అందుకే, ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచన చేయట్లేదని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైతే మాత్రం.. ఆశావహులు చాలామందే ఉన్నారు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. విస్తరణలో తప్పనిసరిగా ముస్లింలకు చోటు కల్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మైనారిటీ అభ్యర్థులెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. సో, వారికి శాసన మండలి ద్వారా చోటు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే నాంపల్లిలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ కమ్యూనిటీ నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు.

బీసీ జనాభాకు తగినంత ప్రాతినిథ్యం లభించలేదన్న ఆక్రోశం పార్టీ నేతల్లో ఉంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక ఎస్టీ జాబితాలోని బంజారా వర్గం కూడా మంత్రి పదవి ఆశిస్తోంది. ఇంకా అనేక మంది నేతలు మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ మరోలా వినిపించినా.. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు మంత్రులను కేటాయిస్తారనే అంటున్నాయి గాంధీభవన వర్గాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..