Madhu Yaski Goud: హై కమాండ్‌ తీరుపై సీనియర్ గౌడ్ అలక.. పదవి దక్కనందుకేనా…!

| Edited By: Balaraju Goud

Sep 11, 2024 | 5:11 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్‌కు నిరాశే ఎదురైంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ని అధిష్టానం నియమించింది. ఈనేపథ్యంలో హై కమాండ్‌పై మధు యాష్కీ గౌడ్ గుర్రుగా ఉన్నారు.

Madhu Yaski Goud: హై కమాండ్‌ తీరుపై సీనియర్ గౌడ్ అలక.. పదవి దక్కనందుకేనా...!
Madhu Yashki Goud
Follow us on

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్‌కు నిరాశే ఎదురైంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ని అధిష్టానం నియమించింది. ఈనేపథ్యంలో హై కమాండ్‌పై మధు యాష్కీ గౌడ్ గుర్రుగా ఉన్నారు. వలస వచ్చిన నేతలకే పదవులు ఇస్తారా..? మొదటి నుండి పార్టీలో కష్టపడ్డ వారికి లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మధు యాష్కీ కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీ తీవ్రంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో, అదేవిధంగా పార్టీని నుండి బీఆర్ఎస్‌లోకి జోరుగా వలసలు జరుగుతున్నా పార్టీ వెన్నంటే ఉన్నారు మధు యాస్కీ గౌడ్. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారిస్తూ, ప్రత్యేక తెలంగాణ కోసం హై కమాండ్ వద్ద తమ గళం వినిపించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. అలాంటిది ఈ సారి ఖచ్చితంగా పీసీసి అధ్యక్ష పదవి మధు యాష్కీ గౌడ్‌కు దక్కతుందని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే చివరికి మహేష్ గౌడ్‌కు పీసీసీ చీఫ్ కట్టబెడుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం జులై 27 న ముగియడంతో, ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలి. కాబట్టి మరొకసారి తనకు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే ఉద్దేశం లేదని రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు కోసం హై కమాండ్ సామాజిక సమీకరణాలతో కూడిన నివేదికను తెప్పించుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా బీసీకి ఇవ్వాలని హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వలస పోయిన నేతలంతా ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుకుంటున్నారు. అలాగే ఎదో ఒక హామీతోనే పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే మొదటి నుండి కష్టపడ్డ తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని మధు యాష్కీ హై కమాండ్‌ను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తనకు బయటి పార్టీల నుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ కోసం పని చేసిన తనను హై కమాండ్ పక్కన బెట్టిందని మధు యాష్కీ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కపోవడంతో అధిష్టానం పై మధు యాష్కీ గౌడ్ గుర్రుగా ఉన్నాడట. ఈ వ్యవహారంపై మరొకసారి పార్టీలో తీవ్రంగా చర్చకు దారి తీస్తోంది. మరి హై కమాండ్ మధు యాష్కీ విషయంలో ఈ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందా అనేది చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..