సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంతో లారీని ఢీకొట్టి అదుపుతప్పిన కారు రెయిలింగ్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ ఆకాష్ కు తీవ్రగాయాలుకాగా…ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే లాస్య నందిత సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్‌కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొత్తకారులో బెలూన్లు తెరుచుకున్నాయా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. లారీని ఢీకొట్టాక నేరుగా వెళుతున్న కారు కుదుపుకు గురై అదుపుతప్పింది. పక్కనే ఉన్న రెయిలింగ్‌ను వేగంగా ఢీకొట్టింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత..దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. .బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. 1986లో జన్మించిన లాస్య…గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్య..ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు. అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య తండ్రి సాయన్న మృతి చెందారు. ఈలోపే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
గతేడాది డిసెంబర్ 24న సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత… లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఓవర్‌లోడ్ అవ్వడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్‌ఫ్లోర్ వరకు దూసుకుపోయింది. ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్ కాలేదు. దీంతో డోర్లను పగలగొట్టి… లాస్య నందితను బయటికి తీశారు సెక్యూరిటీ సిబ్బంది.
లిఫ్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లాస్య నందితను… నెలన్నర గ్యాప్‌లోనే మరోసారి మృత్యువు వెంటాడింది. ఈనెల 13న నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతింది. కారు టైర్ సైతం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో కూడా స్వల్ప గాయాలతో బయటపడింది లాస్య.
నల్గొండ యాక్సిడెంట్ జరిగిన పది రోజుల్లోనే మరోసారి మృత్యువు తరుముకొచ్చింది. అయితే ఈసారి మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య.
కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని లాస్య నందిత ఇంటిదగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లోనే ఉన్నారు లాస్య నందిత తల్లి గీత. లాస్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. భారీగా లాస్య ఇంటికి చేరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..