SC Vargikarana: వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం.. వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గం

|

Nov 12, 2023 | 7:39 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీటిలో మాల, మాదిగ ప్రధానమైనవి. కాగా మిగతావి ఉప కులాలు. ఎస్సీల్లో మాల కులానికి చెందిన వాళ్లు సామాజికంగా, విద్యాపరంగా ముందజంలో ఉన్నారు. వారి జనాభా మాదిగలతో పోలిస్తే, చాలా తక్కువ. అయినప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లన్నీ వారే అనుభవిస్తున్నారంటూ మాదిగ, దాని ఉప కులాలు ఆరోపిస్తున్నాయి.

SC Vargikarana: వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం.. వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గం
Pm Modi, Manda Krishna Madiga
Follow us on

ఎస్సీ వర్గీకరణ తెగని సమస్యగా మారింది. వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప పార్లమెంట్ లో చట్టం తేవడం లేదు. ఇంతకీ ఈ ఎస్సీ వర్గీకరణ ఏంటి..? అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీటిలో మాల, మాదిగ ప్రధానమైనవి. కాగా మిగతావి ఉప కులాలు. ఎస్సీల్లో మాల కులానికి చెందిన వాళ్లు సామాజికంగా, విద్యాపరంగా ముందజంలో ఉన్నారు. వారి జనాభా మాదిగలతో పోలిస్తే, చాలా తక్కువ. అయినప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లన్నీ వారే అనుభవిస్తున్నారంటూ మాదిగ, దాని ఉప కులాలు ఆరోపిస్తున్నాయి.

స్సీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం 1965‌లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం లోకూర్ కమిషన్ వేసింది. కమిషన్ నివేదక మాదిగలు అన్యాయానికి గురవుతున్నట్టు తెలిపింది. 1996 సంవత్సంలో ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలు చేయడంతో, నాటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేసింది. కమిషన్ నివేదిక ప్రకారం 2002 నాటి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించింది. మొత్తం 15 శాతంలో మాదిగ దాని ఉప కులాలకు 7 శాతం, మాల, దాని ఉప కులాలకు 6 శాతం, ఇతర కులాలకు 2 శాతం వర్గీకరించి అమలు చేసింది.

అయితే ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రిజర్వేషన్లు కాస్తా రద్దయ్యాయి. ఇక, ఆ తర్వాత 2008 లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఉషా మెహ్రు కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కూడా ఎస్సీల్లో మాదిగలు వెనుకబడి ఉన్నారని తేల్చింది. అన్ని వర్గాలకు సమ న్యాయం చేయడానికి వర్గీకరణ ఒక్కటే మార్గమని సూచించింది. అయితే దీనికి పార్లమెంట్‌లో చట్టం తేవడం ఒక్కటే మార్గం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు.

ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అన్ని పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి 30 ఏళ్లుగా పోరాడుతోంది. అయితే వర్గీకరణ కాకుండా ఉండేందుకు మాల సామాజిక వర్గం కూడా అంతే ప్రయత్నం చేస్తోంది. దీంతో వర్గీకరణ అంశం తెగని సమస్యగా మారింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందకృష్ణ మాదిగ పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టాలని ఆ పార్టీని కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి లాంటి వారు వర్గీకరణకు హామీ ఇచ్చారు.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్రానికి పంపింది.అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించలేదు. తాజాగా హైదరాబాద్ లో మాదిగ విశ్వరూప సభలో తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇవ్వడం మాదిగ సామాజిక వర్గానికి కొంత ఊరట లభించింది. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడతారనే ఆశతో మాదిగ సామాజిక వర్గం ఉంది.