
పంచాయతీ ఎన్నికల వేళ తీవ్ర విషాదం నెలకొంది.. గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఒత్తిడికి గురై ఏకంగా ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రాణాలే కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం లో గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈసీ ఆయనకు ఉంగరం గుర్తును కేటాయించింది. అయితే రెండో విడతలో భాగంగా ఆదివారం అనాసాగరం గ్రామంలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నాగరాజు గ్రామంలో విస్త్రృతంగా ప్రచారం సాగించారు.
అయితే ఇప్పటికే అనారోగ్యంలో బాధపడుతున్న నాగరాజు.. పోలింగ్ సమీపిస్తున్న ప్రచారం జోరు పెంచారు. కానీ ఈ ఒత్తిడి తట్టుకోలేక పొలింగ్‌కు ఒక రోజు ముందే అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాగరాజు కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ దురదృష్టవ శాత్తు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నాగరాజు మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామాన్ని అభివృద్ది చేద్దామనే కొండంత ఆశతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి.. సరిగ్గా పోలింగ్ రోజే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.