తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇక రాష్ట్రంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ కానుకను అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డి క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారు. రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స బహుమతి కూడా లభించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అసంఘటిత రంగంలో ఎక్కువ సమయం రోడ్లపైనే గడిపే కార్మికులకు భద్రత లభించనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ డెలివరీ కార్మికులు, క్యాబ్‌లు, ఆటోలు నడుపుతున్న గిగ్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ యోజన కింద తెలంగాణలోని గిగ్ వర్కర్లకు రూ. 10 లక్షల ఆరోగ్య రక్షణ కల్పిస్తారు. దీంతో పాటు గిగ్ వర్కర్లు తమ పనుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ మోడ్‌లో ఈ బీమా కవర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన క్యాబ్, ఆటో డ్రైవర్లను కోరారు. రాష్ట్రంలోని అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు బీమా కవరేజీని పొందగలుగుతారు.
అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. అలాగే నాలుగు నెలల కిందట స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి