తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. నిన్న సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. ఈయనతో పాటూ 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ఉన్నతాధికారులు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి లేఖ ద్వారా ఆహ్వానం పంపారు.
ఈ లేఖలో ముందుగా ‘తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనీయా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శకపాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. అందుకే 2023, డిశంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయబోతోంది అని సందేశాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ రావల్సిందిగా ఇదే నా ఆహ్వానం’ అని లేఖలో చివరగా జోడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..