తెలంగాణకు ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కేటాయింపును హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ తరఫు న్యాయవాది కోరిన 3 వారాల వ్యవధిని కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ తిరస్కరించింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని తాము మొదటి నుంచి చెబుతున్నామని.. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు కూడా చెప్పిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్‌గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం.. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల విభజనను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అయితే, తనను ఏపీకీ కేటాయించడంపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. దాంతో సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవచ్చంటూ క్యాట్ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్.. ఇంతకాలం తెలంగాణ సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారు.
ఈ నిర్ణయంపై డీఓపీటీ హైకోర్టులో కేసు వేయగా.. దీనిపై విచారణ కొనసాగుతూ వచ్చింది. దీనిపై విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. ట్రైబ్యునల్ ఆదేశాలను కొట్టివేస్తూ సోమేష్ కుమార్ తన సొంత క్యాడర్ స్టేట్‌కు వెళ్లాల్సిందేనని ఉత్తర్వులిచ్చింది. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్.. సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తీర్పు కాపీ రాగానే ఏపి కి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..