కోట్లు.. కోట్లు వచ్చిపడతాయని మాయ చేశారు.. కట్ చేస్తే.. రిటైర్డ్ సైంటిస్ట్‌నే బురిడీ కొట్టించారు..!
రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజా హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజా హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో సైబర్ నేరాలు.. పెను సవాల్ విసురుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు, టూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చి ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తులు వేస్తూ సైబర్ నేరగాళ్లు కొరకరాని కొయ్యలాగా మారుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎక్కడో ఓ మూలన ఉండి.. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును ఊడ్చేస్తున్నారు. చాలా మంది ఏళ్లుగా దాచుకున్న సేవింగ్స్.. జీవితాంతం పనిచేసి కూడబెట్టుకున్న పీఎఫ్ డబ్బులు.. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచి పెట్టిన డబ్బు.. ఆస్తులు అమ్మగా వచ్చిన సొమ్ములు అకౌంట్లలోకి పడగానే.. స్మార్ట్‌గా కొట్టేస్తున్నారు. బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు.
తాజాగా హైదరాబాద్ మహానగరంలోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL), బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రాజెక్టులో గతంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన 69 ఏళ్ల రిటైర్డ్ డిఫెన్స్ సైంటిస్ట్‌ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మోసపూరితమైన “ట్రేడింగ్ స్కీమ్”లోకి అతన్ని లాగిన స్కామర్లు, హై-ప్రొఫైల్ పెట్టుబడి సలహాదారులుగా నటించి, రూ. 2.8 కోట్లు మోసం చేశారు.
హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటే రిటైర్డ్ సైంటిస్ట్ ఉద్యోగ విరమణ తర్వాత ఇంట్లోనే ఉంటున్నారు. గత ఏడాది 2025 నవంబర్ నెలలో హేమాంగ్ మెహతా, హర్నిష్, మహేష్ శుక్లా, గౌరీ ఆనంద్ అనే వ్యక్తుల నుంచి వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. “కలెక్టివ్ షేర్- పర్చేజ్ స్కీమ్” సలహాదారులుగా పరిచయం చేసుకున్నారు. తాము అధీకృత ఏజెంట్లమని చెప్పుకుంటూ, డిస్కౌంట్ బ్లాక్ డీల్స్, ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్స్, ప్రైవేట్ ఈక్విటీ అవకాశాల ద్వారా 1,200% వరకు అసాధారణ రాబడిని పొందవచ్చని నమ్మబలికారు. నిందుతులు అందించిన లింక్ ద్వారా ‘IndiaBoltPlus’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని బాధితుడికి సూచించారు.
దీంతో ఇదంతా నిజమని నమ్మిన రిటైర్డ్ సైంటిస్ట్, నవంబర్ 5 – డిసెంబర్ 24 మధ్య, 13 లావాదేవీల ద్వారా మొత్తం రూ.2.82 కోట్లను మోసగాళ్ళు అందించిన వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ‘ఇండియాబోల్ట్‌ప్లస్’ యాప్‌లో అతని పెట్టుబడి రూ.40 కోట్లకు పెరిగిందని చూపించే నకిలీ డాష్‌బోర్డ్ ప్రదర్శించారు. అయితే తన వ్యక్తిగత రుణాలను తీర్చడానికి రూ.60 లక్షలు ఉపసంహరించుకోవాలని బాధితుడు భావించాడు. ఆ అభ్యర్థనను బ్లాక్ చేసి, బదులుగా మొత్తం కార్పస్‌ను ఉపసంహరించుకోవాలని సైబర్ కేటుగాళ్లు అతనికి చెప్పారు. అప్పుడు ఆపరేటర్లు నిధులను విడుదల చేయడానికి కమిషన్‌గా అదనంగా రూ.1.75 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చి ఎంక్వెరీ చేయగా ఇండియా బోల్ట్‌ప్లస్ యాప్‌కు పెట్టుబడి సేవల సంస్థతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల బ్యాంకు ఖాతాలు, డిజిటల్ పింగర్ ఫ్రింట్లను గుర్తించడానికి ప్రయత్నిన్తున్నారు. మొత్తంగా సాంకేతికత అందిస్తున్న వెసులుబాటును సామాన్యుల కంటే ఎక్కువగా నేరగాళ్లే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, ట్రేడింగ్ లాభాల ప్రకటనలు, నకిలీగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
