భూ సమస్య పరిష్కారం కోసం వృద్ధ దంపతుల పోరాటం.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు వినతి

|

Jul 28, 2021 | 5:45 AM

ఓ వృద్ధ దంపతులు భూ సమస్య కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. భూ సమస్యను పరిష్కరించుకునేందుకు తిరగరాని చోట్ల తిరిగారు. అయినా వారికి న్యాయం జరగలేదు. దీంతో..

భూ సమస్య పరిష్కారం కోసం వృద్ధ దంపతుల పోరాటం.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు వినతి
Follow us on

ఓ వృద్ధ దంపతులు భూ సమస్య కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. భూ సమస్యను పరిష్కరించుకునేందుకు తిరగరాని చోట్ల తిరిగారు. అయినా వారికి న్యాయం జరగలేదు. దీంతో చావే శరణ్యమని అనుకున్నారు ఈ దంపతులు. సమస్య పరిష్కారం కోసం దంపతులు చేసిన చివరి ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్నేకల్‌ గ్రామానికి చెందిన కొండూరు రామలింగం, రత్నమాల దంపతులు. ఈ వృద్ధ దంపతులు తమ భూ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వీరికి వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల భూమిని కొందరు వీరి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో సాదాబైనామా చేయించుకున్నారు. ఆ తర్వాత భూమి నుంచి తమను కబ్జాదారులు తరిమి వేశారని రామలింగం దంపతులు చెబుతున్నారు. భూకబ్జాపై విచారణ జరిపించాలంటూ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి, రామలింగం సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది.

అయినా భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని దంపతులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకపోయింది. దీంతో తాము భూ కబ్జాదారులపై పోరాడే శక్తి తమకు లేదని.. తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఈ దంపతులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేశామని దంపతులు చెబుతున్నారు. మాకు ఎక్కడా న్యాయం జరగలేదని వాపోయారు. న్యాయం చేయలేని అధికార యంత్రాంగం.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరినట్టు దంపతులు చెబుతున్నారు. అయితే సమస్య పరిష్కారం కోసం వృద్ధ దంపతులు చేసిన ప్రయత్నం కలకలం రేపుతోంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇవీ కూడా చదవండి

YS Sharmila: ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల.. నిరుద్యోగ నిరాహార దీక్ష

ఈనెల 31లోపు పూర్తి చేయండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌