రాజ్యసభ(Rajya Sabha) స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్(TRS) అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే.. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. వద్దిరాజుతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసిన్నప్పటికీ.. ఆ రెండూ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురయ్యాయి.
వద్దిరాజు నామినేషన్ ఒక్కటే సక్రమంగా దాఖలు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇక ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జూన్ ఒకటో తేదీన రాజ్యసభ స్థానాల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ మూడో తేదీ వరకు గడువు ఉంది. రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ పదో తేదీన పోలింగ్ ఉంటుంది. ఈ రెండు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్ పార్టీ. పార్థసారథిరెడ్డి, దామోదర్‌రావు పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే..