
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పదవి కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను ఎంపిక చేసింది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. చివరికి రామకృష్ణారావు పేరును ఖరారు చేసింది.
సీనియారిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో ఉన్నారు. తుది జాబితాను పరిశీలించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించింది. 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రామకృష్ణరావు.. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా రామకృష్ణారావును సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..