Bhatti Vikramarka: ఆ రోజే మంజూరు పత్రాలు.. రాజీవ్ యువవికాసం పథకం లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పథకాల అమలుకు బ్యాంకర్ల సహాయం అవసరమన్నారు భట్టి విక్రమార్క. బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క ఏమన్నారు.. రాజీవ్ యువ వికాసం పథకంపై ఏం చెప్పారు.. డీటెయిల్‌గా చూడండి..

Bhatti Vikramarka: ఆ రోజే మంజూరు పత్రాలు.. రాజీవ్ యువవికాసం పథకం లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..
Revanth Reddy Bhatti Vikramarka

Updated on: May 22, 2025 | 8:25 PM

రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న భట్టి.. జూన్ 2వ తేదీన ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్యాంకర్ల తోడ్పాటు అవసరమన్నారు. ఐదు లక్షల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6,250 కోట్లు సబ్సిడీతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం రుణాల మంజూరు లేఖలు పంపిణీ చేయనున్నామని.. పథకం అమలును సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని ఆయన బ్యాంకులను కోరారు.

తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్దపీట వేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల రుణ భారాన్ని తగ్గించేందుకు రూ.21 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను ఇప్పటికే బ్యాంకుల్లో జమ చేశామని.. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు.

అలాగే రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వం కడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్షల కోట్లు వడ్డీ రహిత రుణాలుగా ఇస్తూ మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల కోసం ట్రైనింగ్ అందిస్తున్నామని తెలిపారు.

మూసీ నదిని పునర్జీవం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య పారిశ్రామిక అభివృద్ధి కోసం వివిధ క్లస్టర్ల ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..