
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎన్నికపై (Rajendranagar Assembly Election) అందరి దృష్టి నెలకొంటోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ సారి కూడా బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కస్తూరి నరేందర్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు ఎంఐఎం నుంచి స్వామి యాదవ్ పోటీలో నిలవడంతో రాజేంద్ర నగర్‌లో చతుర్ముఖ పోరు నెలకొంటోంది.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 5,81,937 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 3,02,995 మంది పురుష ఓటర్లు ఉండగా, 2,78,898 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 55.39 శాతం పోలింగ్ నమోదయ్యింది.
విశ్వ ఖ్యాతి గడిస్తున్న భాగ్యనగరానికి దక్షిణ ముఖ ద్వారం రాజేంద్రనగర్. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన కేంద్రాలు, కళాశాలలు, పంచాయితీరాజ్ శిక్షణ కేంద్రం, రైతాంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా ఉన్నతస్థానానికి చేరిన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఇక దేశ శాంతి భద్రతలు కాపాడే కీలక పోలీస్ ఉన్నతాధికారులను అందించే నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు, రాష్ట్ర ప్రజలకు శాంతిభద్రతల సేవలందించే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ సైతం రాజేంద్రనగర్ పరిధిలోనే ఉన్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్, గండిపేట్, శంషాబాద్ మండలాలతో కూడిన బౌగోళిక ప్రాంతం నుంచి కొత్తగా ఏర్పడింది రాజేంద్రనగర్ నియోజకవర్గం. రంగారెడ్డి జిల్లాలోని రాజకీయాలకు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం ఓటర్లు 2009లో, 2014లో తెలుగు దేశం పార్టీకి పట్టం కట్టారు. 2018లో మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి టీ.ప్రకాష్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్నికల్లో అభ్యర్థిని మాత్రం ఒక్కరినే గెలిపించడం విశేషం.
ప్రస్తుత బీఆర్‌ఎస్ అభ్యర్థి టి. ప్రకాష్ గౌడ్.. తొలి ఎన్నికలో సుమారు ఏడున్నర వేల మెజారిటీ సాధించగా, రెండవ ఎన్నికలో దాదాపు 26 వేల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2018లో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్‌గౌడ్‌ను 58 వేల పైచిలుకు భారీ మెజారిటీతో ఎన్నుకోవడం విశేషం. రాష్ట్రంలో ఏ పార్టీ గాలి వీచినా రాజేంద్రనగర్‌లో మాత్రం ప్రకాష్ గౌడ్ గాలే కొనసాగుతుందని ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు నిరూపించాయి. మరి ఈ ఎన్నికల్లో రాజేంద్రనగర్ ఓటర్లు మరోసారి ప్రకాష్ గౌడ్‌ను ఆశీర్వదిస్తారేమో వేచిచూడాల్సిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్