రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనుంది. దీనికి సంబంధించి రూట్‌మ్యాప్ కూడా సిద్ధమైంది. కర్నాటక నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనున్న రాహుల్ గాంధీ.. 12 నుంచి 14 రోజుల పాటు రాష్ట్రంలో యాత్ర చేయనున్నారు. రాహుల్ గాంధీ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సమయం దగ్గర పడుతుండటంతో… గ్రాండ్ సక్సెస్ అయ్యేలా కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ పీసీసీ. సాధారణంగానే హైసెక్యూరిటీ మధ్య ఉండే రాహుల్ గాంధీ కోసం… రాష్ట్రంలో యాత్ర జరిగినన్ని రోజులూ పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ డీజీపీని కలిసింది పీసీసీ బృందం. మహబూబ్‌నగర్ నుంచి నిజామబాద్ వరకు.. సాగనున్న రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాలనేతలు .. పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించనున్న రాహుల్… మక్కల్ నుంచి దేవరకద్ర,మహబూబ్‌నగర్ టౌన్, షాద్‌నగర్ మీదుగా.. శంషాబాద్ దగ్గర హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తారు. ఆరాంఘర్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయ్‌నగర్ కాలనీ, పెన్షన్ ఆఫీస్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు, ముత్తంగి(ORR) మీదుగా సంగారెడ్డికి వెళ్తారు. అక్కణ్నుంచి జోగిపేట్, శంకరంపేట్ ల మీదుగా మద్నూర్ చేరుకుని ఆ తర్వాత మహారాష్ట్రలోకి ఎంటరవుతారు.
కర్నాటకలో జోరుగా సాగుతున్న జోడో యాత్ర:
కర్నాటకలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. చామరాజునగర్ జిల్లాల్లో జరుగుతున్న పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. వేలాదిమంది కార్యకర్తలు రాహుల్‌కు తోడుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ , సీఎల్పీ నేత సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలు ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే రాహుల్ పాదయాత్రలో పేసీఎం టీషర్ట్‌తో కాంగ్రెస్ కార్యకర్త రావడంతో అడ్డుకున్నారు పోలీసులు . టీషర్ట్‌ను విప్పించి ఆ యువకుడిని చితకబాదారు పోలీసులు . తరువాత వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక పోలీసులు తాము రాచరికంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే. పోలీసులకు ప్రజల నుంచే జీతాలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎంకు ప్రతి పనిలో కమీషన్లు ముడుతున్న విషయం అందరికి తెలుసన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..