Telangana Election: తెలంగాణ గడ్డ.. పీవీ అడ్డా! కాంగ్రెస్‌పై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ

|

Nov 25, 2023 | 7:48 PM

తెలంగాణ ఠీవి....పీవీ, మా వాడంటే మా వాడంటున్నాయి రాజకీయ పార్టీలు. బ్రాండ్‌ పీవీని ఓన్‌ చేసుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. పీవీ ఎప్పటికీ తమవాడే అంటోంది కాంగ్రెస్‌. మరి అలాంటప్పుడు ఆయనను అవమానించినందుకు సారీ చెప్పండి అంటున్నాయి బీఆర్‌ఎస్‌, బీజేపీ.

Telangana Election: తెలంగాణ గడ్డ.. పీవీ అడ్డా! కాంగ్రెస్‌పై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ
Pv Centric Politics
Follow us on

తెలంగాణ ఠీవి….పీవీ, మా వాడంటే మా వాడంటున్నాయి రాజకీయ పార్టీలు. బ్రాండ్‌ పీవీని ఓన్‌ చేసుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. పీవీ ఎప్పటికీ తమవాడే అంటోంది కాంగ్రెస్‌. మరి అలాంటప్పుడు ఆయనను అవమానించినందుకు సారీ చెప్పండి అంటున్నాయి బీఆర్‌ఎస్‌, బీజేపీ. పీవీ పేరుతో తెలంగాణ ఎన్నికల పోరు మరింత వేడెక్కింది.

తెలంగాణ గడ్డ మీద రాజకీయం…ఇప్పుడు తెలుగు బిడ్డ చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ దంగల్లో అన్ని పార్టీలు…పీవీ నామ జపం చేస్తున్నాయి. మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు మా వాడంటే మా వాడంటున్నాయి…అన్ని రాజకీయ పార్టీలు. తెలంగాణ ఎన్నికల పోరులో ఇప్పుడు పీవీ పేరు మరింత వేడి రగులుస్తోంది. కాంగ్రెస్‌ ఆయనను ఓన్‌ చేసుకునే ప్రయత్నాలు చేయడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి.

తెలంగాణ గడ్డ.. పీవీ అడ్డా! ఇప్పుడు అదే తెలుగు బిడ్డను ఓన్‌ చేసుకునేందుకు అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా, పీవీ అంటే తమకెంతో గౌరవం అన్నారు కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ. తాము ఆయనను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామన్నారు ప్రియాంక. ఇందిరాగాంధీతో కలిసి రాజకీయ ప్రయాణం చేశారు పీవీ నరసింహారావు. నాకు కూడా ఆయన బాగా తెలుసు. పీవీజీ..మాకు ఎంతో మద్దతు ఇచ్చారు. నేను ఆయనను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అన్నారు ప్రియాంక.

ప్రియాంక మాటలతో తెలంగాణ దంగల్లో వేడి రగిలింది. పీవీ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. అంత గొప్ప నాయకుడ్ని బతికున్నప్పుడు, చనిపోయాక కూడా ఘోరంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్‌ అంటూ ఆరోపించారు కేటీఆర్‌. పీవీని అవమానించినందుకు తెలంగాణ ప్రజలకు… రాహుల్‌, ప్రియాంక, కాంగ్రెస్‌, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు ఆయన.

ఇక పీవీ నరసింహారావు అంటే అంత గౌరవం ఉన్నప్పుడు…ఆయనను ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్‌ సీఎం అంజయ్యకు జరిగిన అవమానాన్ని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. అలాగే పీవీ నరసింహారావుకు కాంగ్రెస్‌ అధిష్టానం చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అమిత్ షా.

ఇక పీవీ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కూడా కాంగ్రెస్‌ అధిష్టానంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పీవీ మరణించిన తర్వాత కూడా ఆయన పట్ల కాంగ్రెస్‌ ప్రవర్తించిన తీరు సరి కాదన్నారు వాణీదేవి. పీవీని గుర్తించలేని కాంగ్రెస్‌…తెలంగాణకు న్యాయం చేయగలదా అంటూ ప్రశ్నించారు ఆమె.

పీవీ చుట్టూ తిరుగుతున్న ఎన్నికల రాజకీయం..తెలంగాణ దంగల్‌ను మరింత వేడెక్కిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…