
Hyderabad: కరోనా ఉన్నట్లా లేనట్టా? ప్రస్తుతం పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. సెకండ్ వేవ్ సమయంలో యావత్ ఎంతటి ఘోర విపత్కర పరిస్థితులను ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. అంతటి ఘోర పరిస్థితులను చూసినా జనాల్లో మాత్రం ఇసుమంతైన భయం లేదు. అసలు కరోనానే లేదు అన్నట్లుగా, అసలు కరోనా అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ జనాలు మాత్రం మీకేం అవసరం అన్న ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. అందరు కాకపోయినా.. కొందరి తీరు మాత్రం కరోనాను ఘనంగా సుస్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. ఇలాంటి చర్యలు.. థర్డ్ వేవ్‌కు కేరాఫ్ అడ్రస్‌లుగా కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని తార్కాణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎక్కడ చూసినా కరోనా నిబంధనలు గాలికి వదిలేసనట్లే కనిపిస్తోంది. ప్రధానంగా పబ్లిక్ ప్లేస్‌లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్.. వెరీ డేంజర్‌గా ఉన్నాయి. ఎక్కడా మాస్క్ లేదు.. భౌతిక దూరం మాటే.. దూరమైపోయింది. ఆటోలు.. సిటీ బస్సులు కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నాయి. వాహనం నడిపేవారికి సైతం మాస్క్‌లు ఉండవు. ఇలా చాలా వరకు పబ్లిక్ ప్లేస్‌ల్లో మాస్క్‌లు లేకుండా.. ఉన్నా వాటిని అలంకారం కోసం అన్నట్లుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులూ మాస్క్ లేదు. ఆటో నడుపుతున్న డ్రైవర్‌కూ మాస్క్ లేదు. ఇదేమని అడిగితే.. అప్పుడు వారికి మాస్క్ గుర్తొచ్చింది. వెంటనే జేబులో దాచిన మాస్క్‌ని తీసి పెట్టుకోవడం కొస మెరుపు. ఇక.. ఆర్టీసీ బస్సుల్లో అయితే ఒక ఆరాచకమే కొనసాగుతోంది. మాన్క్ లేకుండా చాలా మంది ప్రాయాణిస్తున్నారు. వీళ్ళను మాస్క్ పెట్టుకోమని కండక్టర్ కోరినా నిరాకరిస్తున్నారు.
కొందరు ప్రయాణీకులు అయితే నిజంగానే ఆరాచకంగా ప్రవర్తిస్తున్నారు. తమ పక్కన ప్రయాణిస్తున్న వారు మాస్క్ పెట్టుకున్నా.. తమకెందుకు మాస్క్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిని మాస్క్ గురించి ప్రశ్నిస్తే.. మీకెందుకు అంటూ రివర్స్ తిరిగారు. అతనితో వాగ్వాదానికి దిగాడు. పక్కన వాళ్లు మాస్క్ పెట్టుకోరా బాబూ అని మాస్క్ ఇచ్చినా నిరాకరించాడు. చదువుకున్నవాళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో అవగాహన ఉన్నవాళ్లు సైతం మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రయాణికుల వల్ల ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్ల వల్ల వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని భయపడుతున్నారు. ఇకనైనా, పబ్లిక్ ప్రదేశాల్లోనూ, ట్రాన్స్‌పోర్ట్స్ లోనూ కొనసాగుతున్న నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే థర్డ్ వేవ్ ఎంటరయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా కొంచె బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా.. కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించడం సరికాదు. ఇకనైనా మేల్కోండి.. థర్డ్ వేవ్ పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.
Also read:
Trailer Talk: మారుతి మార్క్ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్ ఎలా ఉందో చూశారా.?
India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!