సంగారెడ్డి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 5న పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. మరో వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రధాని పర్యటన ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. మోడీ రాక సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ విజయవంతం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మొదట బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలోనే నిర్మించిన పౌరవిమానయాన పరిశోధనా సంస్థ (CARO – సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నరు. రూ. 9,021 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు.
కాషాయ దళపతి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐఐటీ, జాతీయ రహదారులు, గ్యాస్ పైప్ లాంటి వాటిని జాతికి అంకితం చేయనున్నారు. 5న సంగారెడ్డి రానున్న మోదీ ముఖ్యంగా సంగారెడ్డి నుండి మదీనాగూడ వరకు దాదాపు రూ. 1300 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులను అలాగే, రూ. 600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఐటీనీ, రూ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి రహదారి విస్తరణ, రూ. 400 కోట్లతో నిర్మించిన సివిల్స్ ఏషియన్ క్లబ్ భవనాలను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అంతటా ఎటువంటి అవంఛనీయమైన సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రధాని మోడీ సంగారెడ్డికి చేరుకున్నాక ఐఐటీ ప్రాంగణంలో హెలికాప్టర్ లాండింగ్ చేయనున్నారు. ఐఐటీ ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన రాష్ర్టంలో కీలకం కానుంది. ప్రస్తుతం మోదీ హవా నడుస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే బహిరంగ సభపై ఇక్కడి బిజెపి అభ్యర్థుల గెలుపు భవితవ్యం ఆధారపడి ఉంది. 5న పటాన్ చెరులోని పటేల్ గుడలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…