Telangana: పోస్టల్‌లో ఎంతకూ ఇంటికి చేరని ఆధార్ కార్డులు.. అనుమానమొచ్చి ఆరా తీయగా
తమకు రావాల్సిన పోస్టల్ కార్డులు, ఆధార్ కార్డులు, ఆఫర్ లెటర్స్ ఇంకా రాలేదు ఏంటా అని.. పోస్టు మాస్టర్ ఇంటికి వచ్చారు కొందరు గ్రామస్తులు. ఇంటికి వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్నా, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏదైనా పోస్టల్ ద్వారా మన ఇంటి అడ్రస్‌కి చేరుకుంటాయి. దానికి నిర్ణీత సమయం వారం కావచ్చు.. 10 రోజులు కావచ్చు.. అయినా తమకు అందాల్సిన కార్డులు, డాక్యుమెంట్స్, ముఖ్యమైన లెటర్స్ ఎన్ని రోజులు ఎదురు చూసినా రావడం లేదు. అనుమానం వచ్చి కొందరు గ్రామస్థులు పోస్ట్ మాస్టర్ ఇంటికి వచ్చారు. తీరా అక్కడ కనిపించింది చూడగా షాక్ అయ్యారు.
అశ్వారావుపేటలో ఓ తపాలా ఉద్యోగి తన బాధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బయటకు వచ్చింది. అశ్వారావుపేట మండలం ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్.. పోస్టు ద్వారా గ్రామస్తులకు వచ్చిన ఆధార్ కార్డులు, బీమా పత్రాలు, పాన్ కార్డు, ఏటీఎం కార్డులతో పాటు పోలీస్ శాఖ ద్వారా వచ్చే నోటీసులను సైతం దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆయా వ్యక్తులకు అందించకుండా తన వద్దే ఉంచుకున్నాడు. తాము అడిగితే రాలేదని సమాధానం చెప్పేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిన లేఖలను కూడా తన గదిలోనే ఉంచేసుకున్నాడు. అతడి గదిలోనే ఆయా ఉత్తరాలు, ఇతర పత్రాలు పడేయడంతో అవి కుప్పలుగా పేరుకుపోయాయి. తమకు రావాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్ కార్డులు రాకపోవడంతో కొందరు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా కంగుతిన్నారు. కుప్పలుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వీటిపై సదరు ఉద్యోగిని స్థానికులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై అశ్వారావుపేటలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యంతో తమకు రావాల్సిన పత్రాలు, కార్డులు అందక అనేకమంది నష్టపోయారు. అతడిపై పోస్టల్ డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
