కవిత రాజకీయ అడుగులు అటువైపేనా..? జూన్ 2న సంచలన నిర్ణయం!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ జాగృతిని పునరుద్ధరించి, 11 ప్రాంతాలకు సమన్వయకర్తలను నియమించారు. బీఆర్ఎస్ నేతలు కవితను బుజ్జగించే ప్రయత్నం విఫలమైంది. బీజేపీ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత యొక్క రాజకీయ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.

సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దారెటు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీతో దూరంగా ఉంటున్న కవిత.. సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. ఇక నిన్న కవితతో బీఆర్ఎస్ రాజ్యససభ సభ్యుడు దామోదరరావుతో పాటు పార్టీ లీగల్ సెల్ ఇంచార్జ్ గండ్ర మోహనరావు సమావేశమయ్యారు. కవితను బుజ్జగించేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.
మరోవైపు కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కూతురి మధ్య మధ్యవర్తులెందుకని ప్రశ్నించారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడుతున్నారని.. షర్మిల తరహాలో కవిత కూడా పాదయాత్ర చేస్తారని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే తన యాక్షన్ ప్లాన్ అమలు చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతికి సంబంధించి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేశామన్నారు. టీజీబీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామమని.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. మోదీ కోసమే సీఎం రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు.
ఇటీవలె ఆమె బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వ్యక్తిగతంగా రాసిన ఒక లేఖ లీక్ అయిన విషయం తెలిసిందే. దానిపై కవిత స్పందిస్తూ.. తన లేక ఎలా లీక్ అయింది అంటూ ప్రశ్నించారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని, కేసీఆర్ దేవుడే కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. కవిత లేకపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరోక్షంగా స్పందించిన విషయం తెలిసిందే. ఎవరైనా లేఖలు రాయొచ్చని, తమది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని.. అయితే సమస్యలుంటే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని కూడా ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
