
హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అక్కడ పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు ఈవీఎంల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19 వేల 102మంది కాగా పురుషులు లక్షా 17వేల 993మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బంది సామగ్రితో శుక్రవారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నేతల వాహనాలను తనీఖి చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని పెట్టారు.
2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 84.42 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంకన్నా 27 వేల మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు.