
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు అనుకోకుండా ఓ ఆటో ఆపారు. ఆటో నిండా స్కూల్ విద్యార్థులతో నిండిపోయింది. బ్యాగులు, లంచ్ బాక్సులు ఆటోకు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. అయితే అసలు ఆటోలో ఎంత మంది ఉన్నారని పోలీసులు విద్యార్థులను ఒక్కోక్కరిగా కిందకు దింపారు. ఆటోలో నుంచి దిగుతున్న విద్యార్థులను కౌంట్ చేస్తుంటే ఖాకీలు ఖంగుతిన్నారు. నలుగురు కూర్చూని వెళ్లే ఆటోలో ఏకంగా 23మంది చిన్నారులను తరలిస్తున్నారు. దీంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు. ఇక విద్యార్థులను వేరే వాహనాలను ఏర్పాటు చేసి ఇంటికి పంపిచేశారు.
ఇక నాగర్ కర్నూల్ ఘటన మరువక ముందే మరో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యాన్ని గుర్తించారు వనపర్తి జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూల్ పిల్లలతో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆటోలో నుంచి విద్యార్థులను దింపి లెక్కించగా 18మందిని తరలిస్తున్నారు. పరిమితికి మించి ప్రమాదకరంగా స్కూల్ పిల్లలను తరలిస్తున్న సంబంధిత డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని… ఆటోపై కేసు నమోదు చేసి ఆర్టీవో సిబ్బందికి అప్పగించారు.
పరిమితికి మించి విద్యార్థులను స్కూళ్లకు తరలించే ఈ ఆటోల వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదైన ప్రమాదం జరిగితే పరిస్థితి ఊహించుకుంటేనే వణుకు వస్తోంది. ఇక ఇలాంటి ఘటనల నేపథ్యంలో వనపర్తి పోలీసులు విద్యార్థుల తల్లితండ్రులు, పాఠశాల యాజమాన్యం, ఆటో డ్రైవర్‌లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను ఈ రకంగా వాహనాల్లో పంపే అంశంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేసే ఇలాంటి నిర్లక్ష్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని వనపర్తి ఖాకీలు స్పష్టం చేస్తున్నారు.