చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువ నిర్మాణ పనులు రణరంగ మవుతున్నాయి. భూములు కోల్పోతున్న రైతులు కాలువ నిర్మాణ పనులకు అడ్డుపడడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పైసా పరిహారం చెల్లించకుండా తమ భూములను లాక్కొని కాలువ నిర్మాణం చేస్తున్నారని బోరున విలపిస్తున్నారు. నిర్మాణ పనులకు అడ్డుపడ్డ బాధిత రైతులను పోలీసులు ఈడ్చుకెళ్ళిన దృశ్యాలు చూపరులను తల్లడిల్లిపోయేలా చేస్తున్నాయి. భూమి కోల్పోతున్న ఓ మహిళా రైతు అక్కడే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం నాలుగు రోజుల నుండి రణరంగాన్ని తలపిస్తుంది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇక్కడి రైతులు రొడ్డెక్కేలా చేశాయి. పైసా పరిహారం చెల్లించకుండానే రైతుల భూముల్లో నుండి కాలువ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ జిల్లాలోని మహాదేవపూర్, కాటారం, మాహాముత్తారం, మల్హార్ ఈ నాలుగు మండలాలకు సాగు – తాగు నీరు అందించాలనే సంకల్పంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు..2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం బీరసాగర్ వద్ద పంప్ హౌజ్ నిర్మాణం జరుగుతుంది. పంపు హౌజ్ నుండి పైప్ లైన్ ద్వారా మహాదేవపూర్ మండలం లోని ఎర్రచెరువు, మాందారీ చెరువులను నింపుతారు. ఇక్కడి నుండి కాలువల ద్వారా నీటి తరలింపుకు ప్రణాళికలు రూపొందించారు.
కాలువ నిర్మాణ పనులు ఆదిలోనే రణరంగంగా మారాయి. ఎలికేశ్వరం ఎరుపెక్కింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాలుగు రోజుల నుండి కాలేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్న బాధిత రైతులు జేసీబీలకు అడ్డుపడ్డారు. ఓ మహిళా రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎలికేశ్వరం వద్ద రైతుల పంట భూముల్లో నుండి కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలువ నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు.. తమకు నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
భూములు కోల్పోతున్న రైతులు జెసీబీకి అడ్డుపడి పనులను అడ్డుకున్నారు. వారిని పోలీసులు ఇడ్చుకెళ్లి కాలువ నిర్మాణ పనులు చేస్తున్నారని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు – పోలీసుల మద్య వాగ్వివాదం, అరెస్టుల పరంపరతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలికేశ్వరం గ్రామానికి చెందిన కమల అనే మహిళా రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు గమనించి మహదేవ్‌పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మహిళా రైతు కమల.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..