(వాసు, టీవీ9 తెలుగు, ఖమ్మం)
Khammam: కన్న కొడుకే కసాయిలా మారాడు.. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పేగుబంధం కర్కశత్వాన్ని చూపించింది.. కన్నతల్లిని కంట్లో పెట్టుకుని చూడాల్సిన కొడుకు హృదయం పాషాణమైంది.. నవ మాసాలు మోసి, కని పెంచిన కొడుకు పెద్దయ్యాక తాను పెరిగిన విధాన్ని మరిచాడు. కన్న తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తినంతటినీ లాక్కుని అమెను నడి రోడ్డు మీదకు గెంటేశాడు. దీంతో దిక్కుతోచని ఆ కన్న తల్లి.. తన కూతుర్లను ఆశ్రయించింది. వారి అండతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ఎదుట తన గోడు వెల్లబోసుకుంది ఆ తల్లి. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామానికి చెందిన గుంజా వెంకమ్మ కు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వెంకమ్మ కుటుంబానికి 6 ఏకరాల పొలం, ఇండ్ల స్థలాలు ఉన్నాయి. వెంకమ్మ భర్త చనిపోగా.. ఆ ఆస్తులన్నింటినీ కొడుకు తన పేరున రాయించుకున్నాడు. అయితే వెంకమ్మ భర్త చనిపోయాక కొడుకు కోడలు భాద్యతగా చూసుకుంటారని ఆ తల్లి భావించింది. కానీ, ఆస్తి మొత్తాన్ని తన పేరిట రాయించుకున్నాక తల్లి ని సరిగా చూడటం మానేశాడు. రోజు తిట్టడం, గొడవ చేయడం పరిపాటిగా కొనసాగించారు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయితే, ఆ వృద్ధురాలు పక్కన ఇండ్లల్లో అడుక్కొని అన్నం తింటూ వచ్చింది. అయితే, తనను పట్టించుకునే వాళ్ళు లేరని తన కన్న కూతుర్లు వద్దకు వెళ్ళింది. కొడుకు చేసిన మోసాన్ని కూతుళ్లకు వివరించింది. వెంకమ్మ తన కూతుళ్లతో కలిసి పోలీసుల ఆశ్రయించింది. కన్న తల్లి ని చూసుకునే బాధ్యత కొడుకుపై ఉందని, తమ తల్లి కి న్యాయం చేయాలంటూ.. పోలీసులకు పిర్యాదు చేశారు. వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ విగ్రహాల అలంకరణకు పిలుపు, పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 3,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 29 మంది మృతి..