
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతంలోని పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి మృతదేహాం లభ్యమైంది. దాన్ని గమనించిన అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు పులి మృతదేహాన్ని పరిశీలించారు. అ పులి కరెంట్ షాక్‌తో మరణించినట్టు గుర్తించారు. అయితే పులి కళేబరానికి చర్మం, గోర్లు లేకపోవడంతో ఇది వేటగాళ్లు చేసిన పనేనని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక పులిని చంపిన వేటగాళ్లు దాని చర్మం ఒలిచి, గోళ్లు , వెంట్రుకలు అపహరించి కాల్చి వేసినట్టు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఘటనా స్థలంలోని పాద ముద్రల ఆధారంగా చనిపోయింది ఆ ప్రాంతంలో ఐదేళ్లుగా సంచరిస్తున్న కే8 పులేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
చనిపోయింది కే8 పులేనా కాదా అన్న విషయాన్ని తేల్చేందుకు సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లూర్ పారెస్ట్ పరిధిలో కే8 పాదముద్రలు లభించడం.. కాలిపోయిన జంతువు కళేబరం సమీపంలో మరో జంతువు అవయవాలు కనిపించడంతో పులి దాడి చేసినట్టుగా గుర్తించారు. అయితే ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారి నీరజ్ కుమార్ టోబ్రివాల్ రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు అంచనా వేశారు. కేసు ర్యాప్తులో భాగంగా స్థానికంగా వేటలు కొనసాగించే 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతి చెందిన బెబ్బులి పెంచికల్ పేట రేంజ్ పరిధిలో సుమారు ఐదేళ్లుగా ఆవాసం చేసుకుని సంచరిస్తున్న కే8 ఆడపులిగా అనుమానిస్తున్నారు. మీడియాకు ఇచ్చిన సమాచారంలో చనిపోయింది ఆడ పులా.. మగ పులా.. దాని వయసెంత అన్న వివరాలు మాత్రం వెళ్లడించ లేదు. దీంతో చనిపోయింది కే8 పులే అని పూర్తిగా నిర్థారణకు రాలేము.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..