సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలులో విద్యార్థులతో ముచ్చటించారు ప్ఱధాని మోదీ. ఈ కార్యక్రమం తరువాత ప్రధాని మోదీ 13 ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభించనున్నారు. అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ఆధునిక భవనాలకు శంకుస్థాపన చేస్తారు. కాగా అంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇకపోతే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రధాని మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అయితే, ఈ ప్రసంగం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
శనివారం నుంచే సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం కాబోతోంది. ఈ రెండు ప్లేస్‌ల నుంచి నడిచే ఈ రైలు నెంబర్ 20701. వారంలో ఆరు రోజుల పాటు నడిచే ఈ ట్రైన్.. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3.15కి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే, ఈ ట్రైన్ ప్రయాణానికి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెగ్యూలర్ సర్వీస్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 10వ తేదీ నుంచి సికింద్రబాబ్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రెగ్యూలర్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి టికెట్ బుకింగ్స్ ఏప్రిల్ 7వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి.
సికింద్రాబాద్-నల్గొండ మధ్య చైర్ కార్ అయితే రూ.470, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.900 ఉంటుంది. అలాగే సికింద్రాబాద్-గుంటూరు చైర్ కార్ అయితే రూ.865, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.1620 ఉంటుంది. సికింద్రాబాద్ – ఒంగోలు మధ్య చైర్ కార్ అయితే రూ.1075, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2045. అదే సికింద్రాబాద్-నెల్లూరు మధ్య చైర్ కార్ అయితే రూ.1270, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.2455 ఉంటుంది. ఇక స్టార్టింగ్ పాయింట్ సికింద్రాబాద్ నుంచి డెస్టినేషన్ తిరుపతి మధ్య చైర్ కార్ అయితే రూ.1,680 ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే రూ.3080 ఉంటుంది.