Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం వరంగల్ చేరుకున్న ఆయన భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు ప్రధాని మోదీకి ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రధాని కోసం ఆలయ అధికారులు 6 రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి వరంగల్‌కి చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ సహా పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ మానుమూరు నుంచి భద్రకాళీ ఆలయానికి పయనమైన ఆయనకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ‘మోదీ మోదీ’ అని నినాదిస్తూ ఆహ్వానించారు.
కాగా, భద్రకాళీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన మోదీ.. అక్కడి నుంచి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ దాదాపు 35 నిముషాల పాటు ప్రసగించనున్నారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగంలో అభివృద్ధి గురించి మాట్లాడాతారా..? బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తారా..? అసెంబ్లీ ఎన్నికల కోసం సమర శంఖం పూరిస్తారా..? అనేది సర్వత్రా అసక్తిగా మారింది.